డేటా దొంగలు ఎవరు?

0
91
telangana date

రెండు తెలుగు రాష్ట్రాల్లో డేటా చోరీ అంశం హాట్ టాపిక్ గా మారింది. అరోపణలు, ప్రత్యారోపణలతో ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రజల వ్యక్తిగత వివరాలను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డేటా గ్రిడ్స్ అనే సంస్థ అక్రమంగా కలిగిఉందనే ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వం సదరు సంస్థపై కేసునమోదు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి డేటా చోరీకి సంబంధించి ఆరోపణల పర్వం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన డేటా వ్యవహారాలను నిర్వహిస్తున్న సంస్థ ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వివరాలతో పాటుగా వారి ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలను కూడా సేకరించిందని ఇది చట్టవిరుద్ధమని అంటూ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడి ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వం కేసును నమోదు చేసింది. అయితే తమ కార్యకర్తలకు చెందిన డేటాను తస్కరించి తద్వారా వైసీపీకి మేలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనేది టీడీపీ వాదన.
వ్యక్తిగత వివరాలను అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు బదలాయిస్తూ ప్రభుత్వం వద్ద ఉండాల్సిన అతి సున్నిత సమాచారాన్ని ఇతరులకు అప్పగించడం ద్వారా ఏపీలోని తెలుగుదేశం ప్రభుత్వం సైబర్ నేరానికి పాల్పడిందని టీఆర్ఎస్ అంటోంది. అయితే టీడీపీ మాత్రం అందుకు భిన్నమైన అంశాలను తెరపైకి తెస్తోంది. వైసీపీకి లబ్ది చేకూర్చాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం తమ కార్యకర్తలకు సంబంధించిన డేటాను దొంగిలించి వారికి అప్పగించిందని అంటోంది. ఈ డేటాను ఉపయోగించి తమ కార్యకర్తలకు చెందిన ఓట్లను తొలగిస్తున్నారని తెలగుదేశం ఆరోపిస్తోంది. పక్కా ప్రణాళికతోనే తమ పార్టీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లను తొలగించడం ద్వారా వైసీపీ అనైతిక చర్యలకు పాల్పడుతోందని టీడీపీ అంటోంది.
ప్రధాని నరేంద్ర మోడీతో కుమ్మక్కయి వైసీపీ,టీఆర్ఎస్ లు కలసి తమను అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. అటు వైసీపీ అధినేత జగన్ మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ డేటాను చోరీ చేసిందని దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటున్నారు. దీనిపై గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం తాము ఎవరిని ఇబ్బందులకు గురిచేయడం లేదని ఈ వ్యవహారంలో పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని చెప్తోంది. దర్యాప్తు వేగవంతంగా జరగడం కోసం ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వేటిగేటివ్ టీం (సిట్) ను ఏర్పాటు చేసింది. డేటా గ్రిడ్స్ సంస్థలో ఏపీకి చెందిన ప్రజల వ్యక్తిగత వివరాలతో పాటుగా తెలంగాణ ప్రజలకు సంబంధించిన డేటాకూడా పెద్దఎత్తున లభించిందని సిట్ అధికారులు చెప్తున్నారు.

Wanna Share it with loved ones?