ఏనుగును జైల్లో పెట్టారంటూ ఆందోళన

కర్ణాటక లోని బన్నేరుఘట్టాలో అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్న “రౌడీ రంగ” ఏనుగును విడుదల చేయాలంటూ వన్యప్రాణి ప్రియులు ఆందోళన మొదలు పెట్టారు. బన్నేరు ఘట్ట ప్రాంతంలోని గ్రామాలపై దాడులు చేస్తూ పంటలను నాశనం చేయడంతో పాటుగా గత మూడు సంవత్సరాల్లో ముగ్గురిని బలితీసుకున్న ఏనుగును ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 70 మంది సిబ్బంది, ఐదు శిక్షణ పొందిన ఏనుగుల సహాయంతో రంగ అనే ఏనుగును అధికారులు నిర్బంధించారు. 11 ఏనుగుల మందకు నాయకురాలిగా వ్యవహరిస్తున్న రంగ మనుషులపై దాడి చేయడంతో పాటుగా పంటలను నాశనం చేస్తుండడంతో అధికారులు అతి కష్టం మీద ఏనుగును నిర్భందించారు.
save-ranga3 save-ranga1 ranga-elephant
అటవీశాఖ అధికారుల చర్యలను వన్యప్రాణి ప్రేమికులు తప్పుపడుతున్నారు. అడవులను వదలి ఏనుగులు జనావాసాల్లోకి రాలేదని జనావాసాలే అడవుల్లోకి చేరాయని వారు అంటున్నారు. అటవీశాఖ అధికారులు పట్టుకున్న 35 సంవత్సరాల ఏనుగును వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా వారు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో అటవీ శాఖ పట్టుకున్న 11 ఏనుగుల్లో 5 ఏనుగులు చనిపోయాయని వన్యప్రాణుల స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికీ లేదని వారు వాదిస్తున్నారు. 11 ఏనుగుల సమూహానికి నాయకత్వం వహిస్తున్న ఏనుగును బలవంతంగా కట్టడిచేయడం సరైన చర్యకాదని దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటున్నారు.
ఇటు అటవీశాఖ అధికారుల వాదన మరోలా ఉంది. రంగ అనే ఏనుగు గత మూడు సంవత్సరాల్లో ముగ్గురు ప్రాణాలను బలితీసుకుందని, దీనితో పాటుగా పెద్ద ఎత్తున పంటలకు నష్టం కలిగించిందని చెప్తున్నారు. స్థానిక గ్రామాల ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతోనే తాను ఈ ఏనుగును అతి కష్టంమీద నిర్భందించగలిగామని చెప్తున్నారు. ఈ ఏనుగుకు శిక్షణ ఇచ్చి మచ్చిక చేసుకుంటాని వారు చెప్తున్నారు. రంగ అనే ఏనుగు ప్రాణాలకు వచ్చిన ముప్పుఏమీలేదని అటవీ శాఖ చెప్తోంది. వన్యప్రాణి సంఘాల ఆందోళనను స్థానిక ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. ఎక్కడో ఉండి అందోళన చేస్తున్న వారికి తమ సమస్యలు ఎట్లా తెలుస్తాయని తమ పంటలను నాశనం చేస్తున్న ఏనుగులను కట్టడి చేస్తే తప్పెంటని వారు ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *