ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐటి దాడులు తదనంతర పరిణామాలపై మీడియాతో మాట్లాడిన ఆయన తమిళ ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. తమిళనాడుపై పై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా దాడిచేసే ప్రమాదం ఉందని తమిళులకు రక్షలేదంటూ వ్యాఖ్యానించారు. పన్నీరు సెల్వం ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుని పడ్డారు. ఐటి అధికారులు దాడులు చేసింది తనపై కాదని తన కుమారుడి ఇంటిపై దాడులకు అనుమతి తీసుకుని తనను అక్రమంగా నిర్భందించారని ఆరోపించారు. తమిళనాడు సచివాలయంలోకి సీఆర్పీఎఫ్ బలగాలు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. ఇప్పటికీ తానే తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శినని ఆయన చెప్పుకొచ్చారు. తనను పదవి నుండి తొలగిస్తున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికీ తనకి అధికారికంగా ఎటువంటి పత్రాలు అందచేయలేదని స్పష్టం చేశారు.
తనను దివంగత ముఖ్యమంత్రి జయలలిత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారని ఆమె బతికి ఉంటే తమిళనాడుకు ఇంత అవమానం జరగేది కాన్నారు. తన వద్ద ఎటువంటి అక్రమ నగదు లభించలేదని చెప్పారు. తన దగ్గర స్వాధీనం చేసుకున్న బంగారం కూడా పరిమితికి లేబడే ఉందన్నారు. తాను న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు.