సెల్ఫీల పిచ్చి ప్రాణాలను తీస్తోంది…సెల్ఫీల పిచ్చి మానవత్వాన్ని మంటగలుపుతోంది…. సెల్ఫీల పిచ్చి ఆపదలో ఉన్న వారిని రక్షించాలనే కనీస స్పహనుదూరం చేస్తోంది. ఒక చిన్నారి తలపై బండరాయి పడ్డా చిన్నారికి సహాయం చేయాలనే కనీస జ్ఞానం కరువై పొటోలు తీసుకోవడంలో మునిగిపోయిన అమానుష ఘటన బెంగళూరులో జరిగింది.
తల్లిదండ్రులు, బంధువులతో కలిసి బెంగళూరు లాల్ బాగ్ కు వెళ్లిన ఆరు సంవత్సరాల చిన్నారి జీవితం విషాదాంతం అయింది. లాల్ బాగ్ లోని ఒక పిల్లర్ పక్కన నిలబడి ఫొటోలు దిగుతున్న సమయంలో పక్కనున్న పిల్లర్ బాలుడిపై పడింది. పిల్లర్ పై డెకరేషన్ కోసం ఉంచిన తిరగలి లాండి బండరాయి చిన్నారి పై పడడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నారి పై బండ పడిన వెంటనే బండను తొలగించడానికి బంధువులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పక్కనున్నవారు ఎవరూ బాలుడిని రక్షించేందుకు ముందుకు రాలేదు సరికదా సెల్ఫీలు తీసుకోవడంలో బిజీగా మారిపోయారు. పార్కు సిబ్బంది వచ్చి సహాయం చేసే వరకు ఎవరూ బాలుడిని రక్షించే ప్రయత్నం చేయకపోవడం దారుణం.
పార్కు సిబ్బంది వచ్చి బాలుడిని రక్షించే ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. బాలుడు అప్పటికే మృతి చెందాడు. ఆహ్లాదంగా పార్కుకు వచ్చి కొడుకుని పోగొట్టుకున్న ఆ తల్లిదంర్డుల వేదన వర్ణనాతీతం.