సంచనాల ఐపీఎస్ అధికారిణి పై బదిలీ వేటు

సహచర పోలీస్ అధికారుల అవినీతి భాగోతాన్ని బట్టబయలు చేసిన ఐపీఎస్ అధికారిణి రూపా మౌద్గిల్ పై కర్ణటక ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్న ఎఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ ప్రకటించి సంచలనం రేపిన మౌద్గిల్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కర్ణాటక కారాగార డీఐజీ గా ఉన్న ఆమెను ట్రాఫిక్ విభాగానికి ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. జైళ్ల శాఖలోని అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పాటుగా ఆ సమాచారన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచడం పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. రహస్య సమాచారాన్ని బయటకు వెల్లడించారంటూ ఇప్పటికే మౌద్గిల్ కు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం ఆమెపై చర్యకు ఉపక్రమించింది. శశికళ వద్ద రెండు కోట్ల రూపాయలు తీసుకుని ఆమెకు జైల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ మౌద్గిల్ ప్రభుత్వానికి లేఖ రాసింది. శశికళకు ప్రత్యేక పరుపులు, వంటగది, టీవీ లాంటి సౌకర్యాలను కల్పించారంటూ ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. దీనిపై తీవ్ర దూమారం రేగింది. తాను రాసిన లేఖ ప్రతిని సమాజిక మాధ్యమాల్లో ఉంచడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఆమె కు నోటీసులు ఇచ్చి ఇప్పుడు బదిలీ చేశారు.