అప్పుకట్టలేదని చావ కొట్టారు…

తీసుకున్న అప్పు కట్టులేదంటూ ఒక వ్యక్తిని ఫైనాన్స్ వ్యాపారులు చితకబాదిన ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఒక వ్యక్తిపై ఇద్దరు దాడిచేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దాడిచేసింది టీఆర్ఎస్ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అనుచరులుగా ప్రచారం సాగుతోంది. బాధితుల కథనం ప్రకారం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీకి చెందిన డోర్నాల జయశంకర్ అనే వ్యక్తి ఫైనాన్స్ వ్యాపారం నిర్వహించే జంగారెడ్డి, దేవేందర్ రెడ్డి అనే సోదరుల దగ్గర రెండు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఇప్పటి వరకు రెండు లక్షల రూపాయల అసలుకు మూడు లక్షల రూపాయల వడ్డీ చెల్లించాలనని బాధితుడు చెప్తున్నాడు. అసలు ఇచ్చేందుకు ప్రయత్నించగా అసలు తీసుకోకుండా వడ్డీ మాత్రమే కట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నారని బాధితుడు వాపోతున్నాడు. దీనికి సంబంధించి కోర్టులో కేసు కూడా నడుస్తున్నట్టు బాధితుడు చెప్తున్నాడు. తాను ఇచ్చిన చెక్కులపై అథికమొత్తంలో రాసుకుని బ్యాంకులో వేసి చెక్ భౌన్స్ అయినట్టు కేసులు పెట్టారని బాధితుడు చెప్తున్నాడు. దీని పై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించానని దానిపై కేసు నడుస్తోందని చెప్పాడు. ఈ క్రమంలోనే తమ ఆస్తికి సంబంధించిన లావాదేవీల కోసం రిజిస్టేషన్ కార్యాలయానికి తమ కుటుంబ సభ్యులతో కలిసి రాగా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహించే సోదరులు, మరో పది మందితో వచ్చి తన పై దాడి చేసి తీవ్రంగా కొట్టారని బాధితుడు చెప్తున్నాడు. దాడికి పాల్పడిన వారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సన్నిహితులు కావడంతో పోలీసులు సైతం కేసును నమోదు చేయడం లేదని బాధితుడు వాపోతున్నాడు. తమకు ఎమ్మెల్యే అండ ఉందని చంపేస్తామని తనను తీవ్రంగా బెదిరిస్తూ దాడికి దిగారని బాధితుడు చెప్తున్నాడు. దాడికి సంబంధించిన దృశ్యాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *