ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ రామ్ నాథ్ కు పూర్తి మద్దతు ప్రకటించి ఆయనకు ఘన స్వాగతం పలికింది. కోవింద్ కు బేషరతు మద్దతు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ జల విహార్ లో పార్టీ ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో కలసి కోవింద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ తనకు మద్దతు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తనకు టీఆర్ఎస్ పార్టీ ఘన స్వాగతం పలకడంతో పాటుగా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున హోర్డింగ్ లు ఏర్పాటు చేయడం పై స్పందించిన కోవింద్ తనకు లభిస్తున్న ఆదరణను చూసి చాలా సంతోషంగా ఉందన్నారు. రాజ్యాంగ బధ్దమైన పదవులను ఎటువంటి పక్షపాతం లేకుండా నిర్వహిస్తానని అన్నారు. ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చారని తాను కూడా వారి బాటలో రాష్ట్రపతి పదవి గౌరవాన్ని పెంచుతానని అన్నారు. అంతకు ముందు మాట్లాడిన వెంకయ్య నాయుడు రాష్ట్రపతి పదవికి కోవింద్ అన్ని రకాలుగా అర్హుడని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎన్డీఏ ఆయన్ను దేశ అత్యున్నత పదవికోసం ఎంపిక చేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ప్రజల ఆంకాక్షల మేరకు ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అభివృద్ది పథంలో దూసుకుని పోతోందన్నారు. తెలంగాణకు అన్ని రకాలుగా సహాయం అందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కోసం రామ్ నాథ్ ఆశీస్సులు కోరుతున్నట్టు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత జగన్ ను కూడా రామ్ నాథ్ కోవింద్ కలుసుకున్నారు. పార్క్ హయత్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ వైఎస్ఆర్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో కలిసి రాష్ట్రపతిని అభ్యర్థిని కలిశారు. రామ్ నాథ్ కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు జగన్ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు మద్దతు ప్రకటించడం పై రామ్ నాథ్ హర్షం వ్యక్తం చేశారు. రామ్ నాథ్ ను కలిసిన సందర్భంగా జగన్ ఆయనకు పాదావివందనం చేశారు.
హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లిన కోవింద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు. తనకు మద్దతు నిచ్చిన చంద్రబాబుకు కోవింద్ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలోని ఒక సమావేశ మందిరంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను రామ్ నాథ్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా కోవింద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి పదవికి అన్ని విధాలుగా ఆర్హడని అన్నారు. రామ్ నాథ్ లాంటి వ్యక్తి వేటు వేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. రామ్ నాథ్ గుణగణాలు తెలిసినందునే ప్రధాని మోడీ కోరిన వెంటనే రామ్ నాథ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించామన్నారు.