పాతనోట్ల జమకు కొంత మందికి మరో అవకాశం…?-

రద్దయిన పెద్ద నోట్ల వ్యవహారంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వం విధించిన గడుపు లోపల రద్దయిన నోట్లను డిపాజిట్ చేసుకోలేకపోయిన వారికి మరో అవకాశం ఇచ్చే అవకాశం ఉందా అని సుప్రీం కోర్టు కేంద్రాన్ని, రిజర్వ్ బ్యాంకును ప్రశ్నించింది. దీనిపై 15 రోజుల్లోగా తమ నిర్ణయం చెప్పాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సహేతుక కారణాల వల్ల రద్దయిన నోట్లను డిపాజిట్ చేయలేకపోయిన వారికి మరో అవకాశం ఇస్తే వచ్చిన ఇబ్బంది ఏంటో కూడా చెప్పాలని సుప్రీం కోర్టు రిజర్వ్ బ్యాంక్, కేంద్రాన్ని ఆదేశించింది. సరైన కారణాల వల్ల నోట్లను డిపాజిట్ చేయలేకపోయి వారికి మరో అవకాశం ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. నోట్ల రద్దుపై దాఖలైన ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని విచారిస్తున్న కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. రద్దయిన నోట్లను మార్చుకోవాడనికి కేంద్రం ప్రత్యేక కౌంటర్లను ఏమైనా ఏర్పాటు చేసిందా అని సుప్రీం ప్రశ్నించింది.
రద్దయిన నోట్లను సహేతుక కారణాల వల్ల జమ చేయలేకపోయిన వారి సమస్యలను గుర్తించాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయ పడింది. నోట్ల రద్దు సమయంలో జైలులో ఉండి గడువు తీరాక విడుదల అయిన వారి పరిస్థితి ఏమిటని కోర్టు ప్రశ్నించింది. సరైన కారణాలతో నోట్లను మార్చుకోలేకపోయిన వారి హక్కును కాలరాయడం సరైంది కాదని కోర్టు అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల రద్దయిన నోట్లను తిరిగి తీసుకునే అవకాశం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతకు ముందు సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. పాత నోట్లను రద్దు చేయడంతో పాటుగా వాటిని మార్చుకోవడానికి ప్రజలకు అవకాశం ఇచ్చామని ఆర్బీఐ కోర్టుకు విన్నవించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *