డ్రగ్స్ దొరికిన విద్యా,ఐటి సంస్థలకు నోటీసులు

0
44

హైదరాబాద్ లో భారీ ఎత్తున పట్టుబడ్డ మత్తుపదార్థాల వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారంపై ఒక ప్రత్యేక బృందం(సిట్) దర్యాప్తు చేయనుంది.త్వరలోనే సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేస్తామని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన కెల్విన్‌ మాస్కెరాన్స్‌(29), చాంద్రాయణగుట్టకు చెందిన సోదరులు ఎండీ అబ్దుల్‌ వహాబ్‌(20); ఎండీ అబ్దుల్‌ ఖుద్దూస్‌(20)లను తెలంగాణ అబ్కారీ శాఖ అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. వీరి వద్ద నుండి 30లక్షల విలువైన మత్తుపదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మత్తుపదార్థాలను ఎల్.ఎస్.డిలుగా అధికారులు గుర్తించారు. ఈ తరహా మత్తు పదార్థాలు దొరకడం నగరంలో ఇదే తొలిసారి. నగరంలోని ఐటి సంస్థలు, బహుళజాతి సంస్థల్లో పనిచేసే కొంత మందితో పాటుగా నగరంలోని ప్రముఖులు కూడా మత్తుమందుల వాడకం దార్లలో ఉన్నట్టు గుర్తించినట్టు అకున్ సబర్వాల్ చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యంగా కొన్ని విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు కూడా వినియోగదారుల్లో ఉన్నట్టు గుర్తించారు. దీనితో పోలీసులు అవాక్కయ్యారు. స్కూల్ పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా కావడంతో ఈ వ్యవహారన్ని సీరియస్ గా తీసుకున్నారు. మత్తు పదార్థాలు దొరికిన విద్యా సంస్థలు, ఐటి సంస్థలకు అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు.
స్కూల్ పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్కూల్ వచ్చే పిల్లల విషయంలో సరిగా వ్యవహరించని విద్యా సంస్థలకు కూడా నోటీసులు అందచేయాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఈ వ్యవహారంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని తప్పు చేసిన వారు ఎంత స్థాయిలో ఉన్నా వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు అంటున్నారు. మత్తు పదార్థాల మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఇటువంటి వాటిని మొగ్గలోనే తుంచకపోతే మరింత ప్రమాదకరంగా తయారయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా పేరుగాంచిన అకున్ సబర్వాల్ నేతృత్వంలో నిందితులకు ఖచ్చితంగా శిక్షలు పడడంతో పాటుగా తెరవెనుక వ్యక్తులను కూడా బయటకు తీసుకుని వచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here