ఢిల్లీలో రెడ్ అలెర్ట్

దేశరాజధాని ఢిల్లీలోకి ఉగ్రవాదులు ప్రవేశించినట్టు వచ్చిన సమాచారంతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దేశరాజధానిలోకి ఆరుగురు లేదా ఏడుగురు ఉగ్రవాదులు ప్రవేశించినట్టు నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందినట్టు తెలుస్తోంది. దీనితో నిఘా వర్గాలు పోలీసులను అప్రమత్తం చేశాయి. దీనితో నగరంలోని అనేక ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేశారు. అదనపు పోలీసులు బలగాలను రప్పించి కీలక ప్రాంతాల్లో మోహరించారు. అనుమానితులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. లండన్ తరహా దాడులకు ఉగ్రవాదులు సిద్ధం అయినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఢిల్లీలో దాడులకు తెగబడేందుకు ఉగ్రమూకలు కాచుకుని కూర్చున్నాయనే సమాచారం అందింది.

ఈద్ కు ముందే దేశరాజధానిలో అలజడి రేపేందుకు ఉగ్రవాదులు పథకం పన్నినట్టు నిఘావర్గాలకు సమాచారం అందింది. ఢిల్లీలో కలకలం సృష్టించేందుకు ఇప్పటికే తీవ్రవాదులు ఢిల్లీకి చేరుకున్నారన్న సమాచారంతో పోలీసులు పలు చోట్ల గాలింపు చర్యలు చేపడుతున్నారు. అనుమానం ఉన్న వారిని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశామని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు చెప్తున్నారు. అయితే ఎవరపైనైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందిచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరో వైపు దేశంలోని ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. దీనితో దేశంలోని అన్ని నగరాల్లోనూ భద్రతను భారీగా పెంచారు.