సోనియాకు ఫోన్ చేసిన మోడీ

ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించిన బీజేపీ రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు నడుం బిగించింది. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాధ్ కోవింద్ పేరును ఖరారు చేసిన బీజేపీ విపక్షాలతో సంప్రదింపులు మొదలు పెట్టింది. ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ లో రాష్ట్రపతి అభ్యర్థి పేరును చెప్పినట్టు తెలిసింది. తమ పార్టీ రామ్ నాధ్ ను ఎంపికచేసిందని ఆయనకు మద్దతు ఇవ్వాలని మోడీ సోనియాను కోరినట్టు తెలుస్తోంది. సోనియాతో పాటుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా మోడీ ఫోన్ చేసినట్టు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కోసం ఇటీవలే విపక్ష నేతలో బీజేపీ ప్రతినిధులు సమావేశమయిన సంగతి తెలిసింది. కాంగ్రెస్ తో పాటుగా వామపక్ష పార్టీలతోనూ బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ సంప్రదింపులు జరుపుతున్నారు.

ఎన్టీఎ రాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించిగా దానిపై విపక్షాలు ఇంకా ఎటువంటి ప్రతిస్పందనా వ్యక్తం చేయలేదు. విపక్షాలు కూడా ఎన్నిక అవసరం లేకుండా ఎన్డీఏ అభర్థికి మద్దతు ప్రకటిస్తా లేక సొంత అభ్యర్థిని రంగంలోకి దింపుతాయా అనేది వేచిచూడాల్సిందే.