షారుక్ అరెస్టు కై అభ్యర్థన

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ను అరెస్టు చేయాలని రైల్వే పోలీసులు అంటున్నారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. రైల్వే స్టేషన్ లో ఒక వ్యక్తి మరణానికి కారణమైన షారుక్ ను అరెస్టు చేయాలని రైల్వే పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం  ‘రయూస్’ చిత్ర ప్రచార కార్యక్రమాల కోసం షారుక్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో వడోదరకు చేరుకున్నారు. ఈ సందర్భంగా షారుక్ ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో తన ఫాన్స్ ను ఉత్సాహ పర్చేందుకు షారుక్ వారిపైకి టీషర్టులు, బాల్స్ విసిరాడు వాటిని అందుకునేందుకు అభిమానులు పోటీలు పడడంతో అక్కడ ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఇందులో ఒకరు చనిపోగా ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు షారుక్ అభిమానుల పైకి టీషర్టులు, బాల్స్ విసిరేయడం వల్లే తొక్కిసలాట జరిగిందని దీని వల్లే ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారని కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న రైల్వే డీఎస్పీ తరుణ్ బరోత్ కోర్చుకు సమర్పించిన నివేదికలో షారుక్ ను అరెస్టు చేయాల్సిందిగా కోరాడు. ఈ ఘటనకు పూర్తిగా బాధ్యత షారుక్ దేనని రైల్వే డీఎస్పీ అంటున్నాడు. అభిమానులను ఉత్సాహపర్చేందుకు షారుక్ చేసిన ప్రయత్నాల వల్లే పరిస్థితి అదుపుతప్పిందని తమ నివేదికలో స్పష్టం చేశారు.