కోచింగ్ సెంటర్లకు సివిల్స్ ర్యాంకర్ షాక్

సివిల్స్ లో జాతీయ మూడో ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ తెలుగు రాష్ట్రాల్లోని సివిల్స్ కోచింగ్ సెంటర్లకు గట్టి షాకిచ్చాడు. తాను ఏ కోచింగ్ సెంటర్లలోనూ శిక్షణ తీసుకోలేదని ఆయన స్పష్టం చేశాడు. కొన్ని కోచింగ్ సెంటర్ల తన పేరును వాడుకోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. గోపాలకృష్ణ ప్రకటనతో తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రముఖ కోచింగ్ సెంటర్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సివల్స్ మూడో ర్యాంకర్ తమ వద్ద కోచింగ్ తీసుకున్నట్టు ఎవరికి వారు ప్రచారం చేసుకున్నారు. ఆయన ఫొటోలను వాడుకున్నారు. దీనిపై స్పందించిన రోణంకి తాను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదని సివిల్స్ కి సిద్ధం అవుతున్నవారు ఈ అబద్దపు ప్రచారాలని నమ్మవద్దని కోరారు. తెలుగు సాహిత్యంలో మాత్రం సీఎస్-ఐఏఎస్ అకాడమీకి చెందిన లాలలత వద్ద సలహాలు, సూచనలు తీసుకున్నట్టు చెప్పారు. అంతకు మినహా ఎవరివద్దా కోచింగ్ లకు హాజరుకాలేదన్ని పేర్కొన్నారు.

కొన్ని కోచింగ్ సెంటర్లలో నిర్వహించిన మాక్ ఇంటర్వ్యూలకు మాత్రమే తాను హాజరయ్యానని గోపాలకృష్ణ వెల్లడించారు. అప్పుడు తీసుకున్న ఫొటోలను ఉపయోగించుకుని తాను వారి వద్ద కోచింగ్ తీసుకుంటున్నట్టు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ఇటువంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని అన్నారు. పట్టుదలతో ఎవరైనా సివిల్స్ సాధించవచ్చని అందుకు తానే పెద్ద ఉదాహరణ అని అన్నారు.