మోడీ దేశ ప్రజలను విడగొడుతున్నారు: సోనియా

తన మూడు సంవత్సరాల పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం ఏం సాధించిందో ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ  వర్కింగ్ కమిటీ సమావేశం సోనియా నివాసం లో జరిగింది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటుగా మాజీ  ప్రధాని మన్మోహన్ సింగ్ పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ  సమావేశంలో సోనియా గాంధీ మాట్లాడుతూ మూడు సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆఖరి దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి అది తమ ఘనతగా మోడీ సర్కారు ప్రచారం చేసుకుంటోందని సోనియా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో దేశ ప్రజలంతా ఒక్కతాటిపై ఉండే వారని ఇప్పుడు ప్రజలను విభజించి పాలిస్తున్నారని అన్నారు. తమ రాజకీయ ప్రయోజనాల  కోసం మోడీ సర్కారు దేశ ప్రజల మధ్య  చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక్క మంచి కార్యక్రమానైనా చెప్పాలని సోనియా డిమాండ్ చేశారు. విదేశీ వ్యవహారాల్లో మోడీ సర్కారు పూర్తిగా విఫలం అయిందని సోనియా ఆరోపించార. కాశ్మీర్ లో పరిస్థుతులు దారుణంగా తయారయ్యాయని కాశ్మీర్ లో శాంతి భద్రతల పరిరక్షణలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు.

     రాష్ట్రపతి ఎన్నికల్లో భావసారూప్యత ఉన్న పార్టీలన్నింటిని కలుపుకుని ఉమ్మడి  అభ్యర్థిని ఎన్నిక్లలో పోటీకి దింపుతామని సోనియా చెప్పారు. అన్ని పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సోనియా వెళ్లడించారు. త్వరలోనే రాష్ట్రపతి అభ్యర్థిపై ఒక నిర్ణయానికి వస్తామని సోనియా పేర్కొన్నారు.  రాష్ట్రపతి ఎన్నికలతో పాటుగా వివిధ అంశాలపై అనుసరించాల్సి వ్యూహాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీకి మరిన్ని బాధ్యతలు అప్పగించే వ్యవహారంపై కూడా ఈ సమావేశంలో చర్చజరిగినట్టు తెలుస్తోంది.