కారులో చిక్కుకుని చిన్నారి మృతి

ప్రమాదవశాత్తు కారులో చిక్కుకుని 6 సంవత్సరాల బాలుడు ఊపిరాడక చనిపోయిన ఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీలోని రాణీబాగ్ ప్రాంతానికి చెందిన ఆరు సంవత్సరాల బాలుడు సోను ఇంటిబయట ఆడుకుంటూ పార్క్  చేసిన కారులోకి దూరాడు. సెంట్రల్ లాకింగ్ సిస్టం ఉన్న కారు కావడంతో డోర్లు లాక్ అయిపోవడంతో అందులోనే ఉండిపోయిన చిన్నారి ఊపిరి ఆడక ప్రణాలు వదిలాడు. ఎండ తీవ్రత  చాలా ఎక్కువగా ఉండడంతో బాలుడి శరీరం పై కాలిన గాయాలు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇంటిబయట ఆడుకుంటున్న తన చిన్నారి కనపడకపోవడంతో అతని తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీస్  స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో గుర్తుతెలియని చిన్నారి తన కారులో చనిపోయి ఉన్నాడంటూ మరో వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు చనిపోయిన బాలుడిని సోనూగా గుర్తించారు. సోను ఇంటికి కొద్ది దూరంలో పార్క్ చేసి ఉన్న కారులోకి చిన్నారి దూరి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. చిన్నారి కారులోకి వెళ్లిన సమయంలో కార్ డార్ లాక్ అయి ఉండకపోవచ్చని అయితే బాలుడు  లోపలికి వెళ్లిన తరువాత లాక్ పడి ఉంటుందని దీనితో బయటకు వచ్చే అవకాశం లేక చిన్నారి ఊపిరి ఆడక చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారి కార్ లో దూరిన విషయాన్ని ఎవరూ గుర్తించకపోవడంతో ఈ దారుణం చోటుచేసుకుంది.