అనగనగా ఒక ఊర్లో పెద్దోడు-చిన్నోడు పక్క పక్కనే ఉంటున్నారు. చిన్నోడిది వక్రబుద్ది ఎదుటివారి ఎదుగుదలను ఓర్చులేని తనం. తన సోమరిపోతుతనం, చాతకాని తనం వల్ల తాను ఎదగలేక పక్కన వాడి ఎదుగుదలను చూసి ఓర్వలేక వాడిని ఎట్లా అయినా దెబ్బతీయాలనే కుటిల ప్రయత్నాలు చేస్తూనే ఉండేవాడు. చాలో రోజుల క్రితం ఇద్దరు కలిసే ఉండేవాళ్లు. అయితే పెద్దోడి నుండి వేరు పడి కొత్త కాపురం పెట్టాడు. అదీ కలహాల కాపురమే. ఎప్పుడూ ఏదో సమస్యలే. పెద్దోడి కాపురంలోనూ చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి వెంటనే సర్థకునేవి. కష్టపడి పనిచేసే కుటుంబ సబ్యులతో వారి ఇల్లు కలకలలాడడం చిన్నోడికి కంట్లో నలుపు పడ్డట్టయింది. ప్రతీ చిన్న విషయానికి పెద్దోడితో గొడవకు దిగేవాడు. మూడు సార్లు పెద్దోడి చేతిలో చావు దెబ్బలు తిన్నా బుద్దిరాలేదు సరికాదా ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వుతూనే ఉండేవాడు. పెద్దోడి సహనం చిన్నోడికి చాతకాని తనంలాగా కనిపించేది. దెబ్బలు తిన్న ప్రతీసారి బుద్ది తెచ్చుకోకుండా మళ్ళీ కయ్యానికి దిగేవాడు…
పెద్దోడితే నేరుగా తలపడే ధైర్యం లేక తన ఇంట్లో కుక్కలను పెంచడం మొదలు పెట్టాడు. ఆ కుక్కలను పెద్దోడి ఇంటిపైకి ఉసిగొలిసి పైశాచిక ఆనందం పొందేవాడు. ఆ కుక్కలను ఎన్నిసార్లు చావకొట్టినా తిరిగి మొరుగుతూనే ఉండేవి. ఒక కుక్క పోతే ఇంకో కుక్క పుట్టుకుని వచ్చేది. లెక్కకు మించి తయారైన కుక్కలు చిన్నోడి ఇంటినే చిధ్రం చేశాయి. ఇంట్లో వాళ్లనే దారుణంగా కరిచాయి. అయినా వాటికి బుద్ది రాలేదు. కుక్కలను పెంచుతూనే ఉన్నాడు. వాటిని పెద్దొడి ఇంటిపైకి ఉసిగొల్పుతూనే ఉన్నాడు. పెద్దోడి పరివారం కుక్కలకు బుద్దిచెప్పినా ఫలితం లేకుండా పోయింది. చిన్నోడి ఇంట్లో ఉన్న కుక్కలకు పెద్దోడి ఇంట్లో కూడా ఒకటి అర సహాయం లభించేది. ఇంకే ముంది ఆ కుక్కలు రెచ్చిపోసాగాయి. కడుపు మండిన పెద్దోడు చిన్నోడి ఇంట్లోకి వెళ్లి మరీ కుక్కలకు బుద్దిచెప్పి వచ్చాడు. అయినా కొత్త కుక్కలు జమ అయి మొరగడం మొదలు పెట్టాయి. అసలు బుద్ది చెప్పాల్సింది మొరిగే కుక్కలకు కాదు.. ఉసి గొల్పే యజమానిని అని గుర్తించిన పెద్దోడు అందుకోసం వేచి చూస్తూ ఉన్నాడు. కుక్కలను ఉసిగొల్పే చిన్నోడి మాడు త్వరలో పగలడం ఖాయం అని ఊరి పెద్దలు చెప్తున్నారు… ఏమవుతుందో చూద్దాం….