నిషీత్ ప్రమాదంపై 'బెంజ్' విచారణ

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషీత్, అతని స్నేహితుడు రవిచంద్ర మరణించిన ఘటనా స్థలిని బెంజ్ కార్ల తయారీ సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. బెంజ్ కార్లలో అత్యాధునిక భద్రతా ప్రమాణాలు ఉంటాయని ప్రచారం. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అందులో ఉండే ఎయిర్ బ్యాగ్స్ సకాలంలో తెరుచుకున్నప్పటికీ ప్రాణనష్టం ఎందుకు జరిగిందనే దానిపై బెంజ్ ప్రతినిధులు విచారిస్తున్నారు. జర్మనీ నుండి వచ్చిన ఇద్దరు బెంజ్ ప్రతినిధులు ఘటనా స్థలంతో పాటుగా ప్రస్తుతం కారు ఉన్న బెయిన్ పల్లిలోని బెంజ్ సర్వీస  స్టేషన్ కు వెళ్లి కారును పరిశీలించినట్టు సమాచారం.
రోడ్డు ప్రమాద కేసును విచారిస్తున్న పోలీసులు బెంజ్ సంస్థకు లేఖరాశారు. ఎయిర్ బ్యాగ్స్ సకాలంలో తెరుచుకున్నప్పటికీ అందులోని వ్యక్తులు ఎందుకు చనిపోయారో చెప్పాలని ఆ లేఖలో పోలీసులు పేర్కొన్నారు. కారు నిర్మాణ పరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా అంటూ కూడా పోలీసులు బెంజ్ సంస్థను ప్రశ్నించింది. దీనిపై వెంటనే స్పందించిన సంస్థ ఇద్దరు ప్రతినిధులను హైదరాబాద్ కు పంపింది. ఈ ఇద్దరు నిపుణులు కారును పరిశీలించి ఒక నివేదికను అందచేయనున్నారు. ప్రపంచంలోనే అత్యున్నత భద్రతా ప్రమాణాలు ఉన్న కార్లలో ఒకటిగా చెప్పుకునే బెంజ్ కారులో ప్రయాణిస్తూ అతి వేగంగా మెట్రో పిల్లర్ ను ఢీ కొనడంతో మంత్రి నారాయణ కుమారుడు నితీష్ తో పాటుగా అతని స్నేహితుడు మృత్యు వాత పడ్డ సంగతి తెలిసిందే.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *