కోమటిరెడ్డి చూపు ఎటువైపు…?

తెలంగాణ వ్యాప్తంగా పలుకుబడి ఉన్న నేతల్లో ఒకరైన కోమటిరెడ్డి బ్రదర్స్ తమ రాజకీయ భవితవ్యంపై మల్లగుల్లాలు పడుతున్నారు. అంగ, ఆర్థిక బలాలు పుష్కలంగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బలమైన అనుచరులున్నారు. కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన వీరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ లోని ఇతర నేతలంతా ఒక్కటై కోమటరెడ్డి బ్రదర్స్ ను ఎదుర్కొనే క్రమంలో ఒక్కతాటిపైకి రావడంతో వీరి పరిస్థితి పార్టీలో ఇబ్బందికరంగా మారింది. పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డితో పాటుగా సీనియర్ నేత జానా రెడ్డిపై కారాలు మిరియాలు నూరే వీరి వైఖరికి నిరసనగా కాంగ్రెస్  పార్టీలోని సీనియర్ నేతలంతా కలసికట్టుగా కోమటిరెడ్డి బ్రదర్సపై యుద్ధానికి సిద్ధం కావడంతో వీరిని ఏటూ పాలుపోని పరిస్థితి తలెత్తింది. కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ కలుపుకుని పోయే ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. పీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి సోదరులకు ఆ  పదవిని రాదని దాదాపుగా తేలిపోవడంతో ఇక ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నట్టు కనిపిస్తోంది.
టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించకుండా పోయాయి. హరీష్ రావుతో కోమటిరెడ్డి బ్రదర్స్ మంతనాలు సాగించినప్పటికీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ టీఆర్ఎస్ లోకి వచ్చే దారులు మూసుకునిపోయినట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ టీఆర్ఎస్ లోకి వస్తే తన ఆదిపత్యానికి గండిపడుతుందని భావించిన జగదీశ్ రెడ్డి ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ రాక వల్ల తన ఆధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందోనన్న అనుమానంతో మంత్రి జగదీశ్‌రెడ్డి చెక్‌పెట్టారు. దీనితో ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ వైపు చూస్తున్నారు. అటు బీజేపీ కూడా తెలంగాణలో పట్టు కోసం కోమటిరెడ్డిబ్రదర్స్‌ లాంటి నేతల్ని ఆకర్షించే పనిలో బీజేపీ పడ్డట్టు తెలుస్తున్నది.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నాలుగు సార్లు  నల్లగొండ ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  మంత్రిగా పనిచేశారు. నకిరేకల్‌, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాలపై  కోమటిరెడ్డి బ్రదర్స్ కు  మంచి పట్టుంది. టీఆర్‌ఎస్‌ గాలీలోనూ   స్థానిక సంస్థల కోటాలో తన సోదరున్ని ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాడు. కాంగ్రెస్‌ పార్టీ బలహీన స్థితిలో ఉన్నందున క్యాడర్‌లో జోష్‌ పెంచి పూర్వ వైభవం తీసుకురావాలంటే తమలాంటి శక్తిమంతులకు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆయన  అధిష్టానాన్ని నేరుగానే  కోరారు. టీపీసీసీ అధ్యక్షులుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పనికిరాడని విమర్శించారు.   తమకే ఆ పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి సోనియా గాంధీకి కానుకగా ఇస్తామని, సీఎం పదవి చేపడతామని కోమటిరెడ్డి బ్రదర్స్‌ బహిరంగంగానే కామెంట్లు చేశారు. దీంతో సీనియర్లంతా ఒక్కటై కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఒంటరి చేశారు. ఇటీవల రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ తెలంగాణ ఇన్‌చార్జి దిగ్విజరుసింగ్‌ సమక్షంలోనే పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డితో గొడవ పడి చేయి చేసుకున్నాడు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా స్పందించింది.
తెలంగాణలో బీజేపీ బలోపేతంపై దృష్టిసారించిన బీజేపీ  ప్రజా బలం, ఆర్థిక పరిపుష్టి ఉన్న నేతల్ని ఆకర్షించే పనిలో పడ్డారు. ఆ జాబితాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఉన్నట్టు తెలుస్తున్నది. మరోవైపు రూ.3 వేల కోట్ల బొగ్గు తవ్వకాల కాంట్రాక్టులను కోమటిరెడ్డి బ్రదర్స్‌ చెందిన సుశీ కంపెనీ చేస్తున్నది. బీజేపీ కక్షకడితే కేంద్రం పరిధిలో ఉన్న బొగ్గు కాంట్రాక్టులు దెబ్బతింటాయనే భయం బ్రదర్స్‌కు పట్టుకుంది. అందుకే బీజేపీ వైపు మొగ్గు చూపేందుకు తన అనుచరులతో సమాలోచనలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.  బీజేపీ కూడా రెడ్డి సామాజిక తరగతికి చెందిన బలమైన నాయకుల్ని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నది. కోమటిరెడ్డి బ్రదర్స్‌ బీజేపీలో చేరితే ఉమ్మడి నల్లగొండతో పాటు ఇతర జిల్లాల్లోనూ వాళ్ల ప్రభావాన్ని ఉపయోగించుకోవచ్చని కమలం నేతలు యోచిస్తున్నట్టు ప్రచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *