చార్మినార్ చెంత చెత్త…చెత్త…

charminar1 Charminar_0_0
 
స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా దేశంలోని ప్రముఖ కట్టడాల, చారిత్రాత్మక ప్రాంతాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో చెత్త కనిపించకుండా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ జాబితాలో మన చార్మినార్ కు కూడా చోటు దక్కింది. ప్రస్తుతం చార్మినార్ పరిసర ప్రాంతాలు పూర్తిగా చెత్తకుప్పగాలా మారిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ పుణ్యమా అని అక్కడి రూపురేఖలు మారాలని సగటు హైదరాబాదీ కోరుకుంటున్నాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చారిత్రాత్మక కట్టడం చార్మినార్, దాని పరిసర ప్రాంతాలు  పూర్తిగా చెత్తకుండీని తలపిస్తున్నాయి. వ్యాపారుల అక్రమణలతో ఈ ప్రాంతంలోని రోడ్లు ఎప్పుడో కుచించుకుని పోయాయి. రోడ్డు ఆక్రమణలకు తోడు ఇష్టం వచ్చినట్టు చెత్తను రోడ్డు మీద వేస్తుండడంతో చార్మినార్ పెద్ద చెత్త  కుండీ మాదిరిగా తయారయిందంటే అతిశయేక్తి లేదు.
పండ్ల వ్యాపారులు, జ్యూస్ బండ్లు, చెరుకు రసం బండ్లు, టీ స్టాల్స్ ఇతర తినుంబాండారాలు, చిరు వ్యాపారులతో చార్మినార్  పరిసర ప్రాంతాలు పూర్తిగా నిండిపోయి ఉంటాయి. ఇక్కడికి వచ్చే పర్యటకులే జీవనధారంగా వందలాది మంది చిరు వ్యాపారులు ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. అయితే ఈ వ్యాపారులు చారిత్రక చార్మినార్ ను చెత్తకుండీగా మారుస్తున్నారు. పండ్ల తొక్కలు ఇతర చెత్తా చెదారం అంతా రోడ్లమీదనే వేస్తుండడంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు అసహ్యించుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎన్ని సార్లు శుభ్రం చేసినా తిరిగి చెత్తతో నిండిపోతోందని జీహెచ్ఎంసీ సిబ్బంది వాపోతున్నారు. చిరు వ్యాపారులను అక్కడి నుండి దూరంగా పంపడానికి జరిగిన ప్రయత్నాలు అన్ని విఫలం అయ్యాయి. వీరిని ఇక్కడి నుండి కదిలించే సాహయం చేయలేకపోతున్నారు. సున్నిత ప్రాంతం కావడం, వ్యాపారులకు రాజకీయ అండ పుష్కలంగా ఉండడంతో వీరిని చారిత్రక కట్టడానికి దూరంగా పంపడం అసాధ్యంగా మారింది.
రోడ్లపై చెత్తను వేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని చిరు వ్యాపారులు రోడ్ల ను ఆక్రమించుకోకుండా చూడడం సాధ్యం కావడం లేదని జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ప్రత్యేక డ్రైవ్ ల పేరుతో పోలీసుల సహకారంతో వారిని దూరంగా జరిపినా కొద్ది గంటల్లోనే వారు తిరిగి రోడ్డు పైకి వస్తున్నారని వారిని నియంత్రించడం తమ వల్ల కావడం లేదని బల్దియా అధికారులు చేతులెత్తేస్తున్నారు. వారి దగ్గరకు వచ్చిన ప్రతీసారి తమపై రాజకీయ ఒత్తిడులు తీవ్రం అవుతున్నాయని వారంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *