ఆనం వివేకాకు పొమ్మనక పొగపెట్టారా…?

0
67

anam
తన హావభావాలు, వాగ్భాణాలతో రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆనం వివేకానంద రెడ్డికి తెలుగుదేశం పార్టీలో కనీస గుర్తింపు కరువయింది. కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన వివేక నెల్లూరు రాజకీయాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ ఒక ఇమేజ్ ను సృష్టించుకున్నారు. సోదరుడు మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డితో కలిసి  కాంగ్రెస్ పార్టీని వదిలి టీడీపీలో చేరిన వీరికి అక్కడ సరైన ప్రధాన్యం దక్కలేదనే చెప్పాలి. దీనితో టీడీపీనీ వదిలిపెట్టే యోచనలో వివేకా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో చేరే సమయంలో తనకు టీడీపీ నేతలు ఇచ్చిన హామీలు నెరవేరలేదని దీనితో అనుచరుల వద్ద తల ఎత్తుకోలేని పరిస్థితి వచ్చిందని వివేకా సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ ఇక్కడ ఉండడం అవసరమా అని ఆనం వివేకానంద రెడ్డి తన సన్నిహితులతో చర్చిస్తున్నట్టు సమాచారం. టీడీపీ కూడా ఆనం వ్యవహారంలో పెద్దగా ఆశక్తి చూపిస్తున్నట్టు కనబడడం లేదు.  ఆయన పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టు ఉన్నా పార్టీ పెద్దలు పెద్దగా పట్టించుకోవడం లేదు. పొమ్మనక పొగపెట్టినట్టుగా పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్నారని వివేకానంద రెడ్డి సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించి నట్టు తెలుస్తోంది.
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తిరులేని నేతలుగా ఉన్న ఆనం బ్రదర్స్ ప్రభ క్రమంగా తగ్గుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో టీడీపీ పంచన చేరిన వీరికి పార్టీలో పెద్దగా గుర్తింపు లభించలేదు. అప్పటికే జిల్లా టీడీపీలో బలంగా ఉన్న నేతలు వీరిని పెద్దగా పట్టించుకోవడం లేదు.  ఆనం వివేకానంద రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని వాగ్దాం చేసిన అది కార్యరూపం దాల్చలేదని ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ పదవి వచ్చే అవకాశమే లేదని తెలిపోవడంతో ఇక ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.  అటు పార్టీలోనూ ఎటువంటి గుర్తింపు  లేదని టీడీపీ కార్యకర్తలు తమకు పెద్ద విలువ  ఇవ్వడం  లేదని నాయకులు అసలు పట్టించుకోవడం లేదని వివేకా అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు లేదని భావించి టీడీపీలో చేరామని అయితే ఇక్కడా తమకు రానున్న రోజుల్లో మంచి అవకాశాలు వస్తాయనే ఆశకూడా లేదని వివేకా వాపోతున్నట్టు తెలుస్తోంది. తనకు మొదటి నుండి టీడీపీలో చేరడం పెద్దగా ఇష్టం లేకపోయినా సోదరుడు బలవంతం మీద వచ్చానని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్తున్నారు. త్వరలో సరైన నిర్ణయం తీసుకోకుంటే రాజకీయంగా చాలా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వివేకా యోచిస్తున్నట్టు తెలుస్తోంది.  దీనికి తోడు ఇటీవల వైసీపీ కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి వివేకాకు ఫోన్ చేసి వైసీపీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. కలిసి పనిచేసుకుందాం రావాలంటూ కరుణాకర్ రెడ్డి ఫోన్ చేయడంతో దీనిపై వివేకా  తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపుగా వివేకా టీడీపీని వీడడం ఖాయంగా కనిపిస్తోంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here