ప్రియురాలి కోరిక తీర్చలేక హైజాక్ నాటకం….

టూర్ కి వెళ్లాలనే  ప్రియురాలి కోరిక తీర్చలేక విమానాలు హైజాక్ అవుతున్నాయంటూ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా తన వాదనకు బలం చేకూరేందుకు ఏకంగా పోలీసులకు  బెదిరింపు ఈ -మెయిల్ పంపిన ఒక యువకుడు చివరకు కటకటాల పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం విమానాన్ని హైజాక్ చేస్తానంటూ ముంబాయి పోలీసులకు ఒక ఈ-మెయిల్ వచ్చింది. ఆరుగురు పిల్లలతో ఒక మహిళ విమానాన్ని హైజాక్ చేయనుందనేది ఆ ఈ-మెయిల్ సారాంశం దీనితో పోలీసులు అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్, ముంబాయి, చెన్నై విమానాశ్రయాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. సందర్శకుల పాస్ లు నిలిపివేశారు. విమానాశ్రయాల్లో అణువణువూ గాలింపు చేపట్టారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాతే లోపలికి పంపారు. ఇటు పోలీసులు, అటు విమానాశ్రయ సిబ్బంది నానా హైరానా పడ్డారు. అసలు ఈ-మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందా అని ఆరా తీసిన పోలీసులకు ఆ మెయిల్ హైదరాబాద్ నుండి వచ్చిందని తేలింది. దీనితో ముంబాయి పోలీసులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి సహాయం కోరగా ఆయన్ని ఈ వ్యవహారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పగించారు.
బెదిరింపు ఈ-మెయిల్ వ్యవహారంపై దృష్టిపెట్టిన హైదరాబాద్ టాస్క్  ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి నేతృత్వంలోని బృందం మరింత లోతుగా విచారణ జరిపింది. మెయిల్ అమీర్ పేటలోని ట్రావెల్ ఏంజెట్ వంశీ ఈ మెయిల్ పంపినట్టు గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విచారణలో తానే బెదిరింపు ఈ-మెయిల్ ను పోలీసులకు పంపినట్టు వంశీ అంగీకరించాడు. విహార యాత్రకు వెళ్దామంటూ తన ప్రియురాలు చేస్తున్న ఒత్తిడి నుండి తప్పించుకునేందుకే ఈ పనిచేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. వంశీ ప్రియురాలు చెన్నైలో ఉంటుందని ఆమె ముంబాయి, గోవాలకు విహరయాత్రకు వెళ్దామంటూ  ప్లాన్ చేసిందని అయితే వంశీ దగ్గర టూర్ కు వెళ్లడానికి అవసరమైన ఆర్థిక వనరులు లేకపోయినా ప్రియారాలు వత్తిడి చేయడంతో విమానాలు హైజాక్ అవుతున్నాయంటూ పోలీసులకు మెయిల్ పంపితే విమానాలు రద్దవుతాయని తద్వారా  ఇబ్బందుల నుండి గట్టెక్కవచ్చని భావించిన వంశీ ముంబాయి పోలీసులకు మెయిల్ పంపినట్టు పోలీసులు చెప్పారు. మొత్తం మీద ప్రియారాలి టూర్ ఒత్తిడి చివరకు ప్రియుడిని కటకటాల్లోకి నెట్టింది.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *