భారత దేశచరిత్రలో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మరో జలియన్ వాలా బాగ్ గా చరిత్రకు ఎక్కిన ఇంద్రవేెల్లి కాల్పులు జరిగి నేటికి 36 సంవత్సరాలు పూర్తయ్యాయి. తమ హక్కులకోసం ఉధ్యమించిన అమాయక గిరిజనులపై పేలిన తూటాలకు 60 మంది బలికాగా 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని అనధికార అంచానా. నాటి ప్రభుత్వం మాత్రం ఈ కాల్పుల్లో 13 మంది మరణించారని 9 మంది గాయపడ్డారని ప్రభుత్వం ప్రకటించిది. కోలాం, పర్ఫాన్, తోటి, కో య, నాయక్ పోడ్ గిరిజనులు తమ హక్కులకోసం చేసిన పోరాటం చివరికి పదుల సంఖ్యలో గిరిజనుల ప్రాణాలను బలిగొన్నది. వ్యాపారుల దోపిడీ, అటవీ ఉత్పత్తులపై కనీస ధర, పోడు భూములపై హక్కులు వంటి డిమాండ్లతో గిరిజన రైతు కూలీ సంఘం 1981 ఏప్రిల్ 20న ఏర్పాటు చేసిన ఇంద్రవెల్లి సభ రక్తం చిందించింది. నక్సలైట్ల మద్దతుతో ఏర్పాటైన ఈ సభను అడ్డుకునేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. సభకు రావద్దంటూ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఇంద్రవెల్లిలో 144 సెక్షన్ విధించినా పెద్ద సంఖ్యలో గిరిజనులు సభకు రావడం మొదలుపెట్టారు. ఎక్కడి వారిని అక్కడ అడ్డుకున్నా ఫలితం లేకుండా పోయింది. లాఠీలు విరిగాయి చివరకు తూటాలు పేలాయి. ఈ కాల్పుల్లో పెద్ద సంఖ్యలో గిరిజనలు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం ప్రకటించిన మృతులకు వాస్తవానికి చాలా తేడా ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఇంద్రవెల్లి ఘటన ఒక చీకటి అధ్యాయనాన్ని లిఖించుకుంది. నెత్తుటి మరకలతో చరిత్రలో ఒక పుటగా నిల్చిపోయిన ఇంద్రవెల్లి ఘటన అనంతరం అనేక రాజకీయ మార్పులకు, ఉధ్యమాలకు వేదికగా నిల్చిపోయింది. గిరిజన హక్కుల కోసం పోరాటం మరింత ఉధృతం అయింది. ప్రభుత్వం తరపున కొత్త పథకాలకు నాంది అయింది.