ఓ సింహం…ఓ గుంటనక్క…

అనగనగా ఓ అడవి… ఆ అడవికి రాజు ఓ సింహం… తమ రాజు సింహం అంటే అడవిలోని మిగతా జంతువులకు భయంతో పాటు భక్తి కూడా చాలా ఎక్కువ. రాజు గారంటే అమితమైన ఆదరాభిమానాలు చేపేవి అడవిలోని జంతువులు. రాజు  గారికి ఒక గుంట నక్కతో స్నేహం కుదిరింది. ఆ గుంటనక్క రాజుగారిని మచ్చిక చేసుకుని రాజుగారి బాగోగులు అన్ని తానే చూసేది. సింహానికి సమయానికి అనుగుణంగా అన్నీ సమకూర్చి పెట్టేది. క్రమంగా సింహ రాజు  గారికి గుంటనక్కమీద నమ్మకం కుదిరింది. తన తరపున అన్ని వ్యవహారాలు గుంటనక్కకే అప్పగించింది. గుంట నక్కతో పాటుగా దాని కుటుంబం మొత్తానికి సింహం గుహనే నివాసం అయింది. అవి కూడా అక్కడే ఉండసాగాయి. క్రమంగా సింహానికి చెందిన అన్ని వ్యవహారాలను గుంటనక్క తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. అడవి జంతువులు ఏవి వచ్చినా సింహం దగ్గరికి వెళ్లాలంటే ముందుగా గుంటనక్కగారి దర్శనం తప్పనిసరి అయింది. సింహంతో పాటుగా అడవిలోని జంతువులు గుంటనక్కగారికి కూడా గౌరవం ఇవ్వడం ప్రారంభించాయి. సింహంతో ఉన్న చనువు వల్లే తనకీ గౌరవం దక్కిన సంగతిని మర్చిపోయిన గుంటనక్క అడవి జంతువుల గౌరవం అంతా తన గొప్పగానే భావిస్తూ వచ్చింది…
గుంటనక్క దాని కుటుంబం పరిధులు ప్రవర్తించడంతో ఒకరోజు ఒళ్లు మండిన సింహం వాటిని తన గుహ నుండి బయటకు వెళ్లగొట్టింది. మళ్లీ తన దగ్గరకు వస్తే ప్రాణాలు దక్కవంటూ హెచ్చరించింది. బతుకు జీవుడా అంటూ గుంటనక్క గుహవదిలిపెట్టి వెళ్లింది. సింహం గుహలో ఒంటరిగా మిగిలింది. గుంటనక్క సపర్యలకు అలవాటు పడిన సింహం కూడా కొద్దిగా ఇబ్బందులు పడింది. కుటుంబాన్ని వదిలి వచ్చిన గుంటనక్క తాను సింహంతోనే ఉండిపోతానని తన కుటుబంతో తెగతెంపులు చేసుకుంటానని చెప్పడంతో తిరిగి నక్కతో తన దోస్తీని కొనసాగించింది సింహం. కొన్నాళ్లకు సింహం అనారోగ్యంతో చనిపోయింది. గుంటనక్క తనను తాను అడవికి రాజుగా ప్రకటించుకుంది. ఇన్నాళ్లు సింహం పక్కన ఉండి పాలనలో మెలకువలు అన్నీ వంటబట్టించుకున్న తాను తప్ప మరో దిక్కులేదంటూ అడవి జంతువులకు నచ్చ చెప్పింది. మరో మార్గం కనిపించని జంతువులు అన్నింటికీ తల ఊపాయి….
గుంట నక్క సింహాసనాన్ని ఎక్కే సమయంలోనే అనుకోని ఇబ్బంది వచ్చిపడింది. గుంటనక్కకు మహరాజును చేయడానికి వీలులేదని చిలుక పండితుడు చెప్పడంతో వెనక్కి తగ్గింది. తనకు మారుగా తన ప్రతిరూపాన్ని పెట్టి పరోక్షంగా పక్క అడవినుండి పాలన చేయాలనుకుంది గుంట నక్క…. అడవిలో అలజడి మొదలైంది. అడవిని గుంటనక్క, దాని కుటుంబం అమ్మేసుకుంటోందనే ప్రచారం జరిగింది. ఇన్నాళ్లు సింహాన్ని చూసి గుంటనక్కకి వంగి వంగి సలాములు చేసిన జంతువులు గుంటనక్కను పట్టించుకోవడం మానేశాయి. సింహంలాగా గర్జించడానికి ప్రయత్నించిన గుంటనక్కకు అది సాధ్యం కాలేదు. గర్జన కాస్తా ఊళగా మారింది. దీనితో అడవి జంతువులన్నీ గుంట నక్కను అడవి నుండి తరిమేశాయి. సింహంతో సన్నిహితంగా ఉన్నాం కదా అని మనమూ సింహంలాగా ప్రవర్తిస్తే కుదరదు… సింహం సింహమే…గుంటనక్క గుంటన్కే… ఇదీ కథ
(నోట్: ఇందులోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు ఎవరినీ ఉద్దేశించినవి కాదు… ఎవరికైనా ఏదైనా అర్థం అయితే మా తప్పు కాదు…)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *