మా కుటుంబంలో విభేదాలు లేవు:అఖిల ప్రియ

తమ కుటుంబంలో ఎటువంటి తగాదాలు లేవని ఆంధ్రప్రదేశ్ మంత్రి భూమా అఖిల ప్రియ చెప్పారు. తమ కుటంబంలో విభేదాలు బయలుదేరినట్టు వస్తున్న వార్తలను ఆమె కొట్టి పడేశారు. తమ కుటుంబం అంతా ఐకమత్యంగా ఉందన్నారు.  తన తండ్రి దివంగత భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో తమ కుటుంబం నుండి ఒకరు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తారని ఆమె చెప్పారు. తమ కుటుబం నుండి ఎవరు పోటీ చేసేది త్వరలో వెల్లడిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈనెల 24న శోభానాగిరెడ్డి వర్థంతి జరుగుతుందని దానితరువాత అభ్యర్థి ఎంపిక నిర్ణయం తీసుకుంటామన్నారు.
నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఇతర పార్టీలు పోటీ పెట్టకుండా ఉంటాయని తాను అశిస్తున్నట్టు అఖిల ప్రియ తెలిపారు. ఎవరైనా నాయకులు హఠాత్తుగా మరణిస్తే వారి కుటుంబ సభ్యులు పోటీ చేస్తే అట్లాంటి స్థానం నుండి ఇతర పార్టీలు తమ అభ్యర్థులను నిలపకుండా ఉండడం ఆనవాయితీగా వస్తోందని నంద్యాలలో కూడా ఆ ఆనవాయితీని కొనసాగిస్తారని ఆశిస్తున్నట్టు అఖిల ప్రియ అన్నారు. శోభా నాగిరెడ్డి మరణించినప్పుడు  కూడా తెలుగుదేశం పార్టీ ఆ నియోజక వర్గం  నుండి తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదనే సంగతిని అఖిల ప్రియ గుర్తు చెశారు.
మరో వైపు నంద్యాల  నుండి తమ పార్టీ అభ్యర్థి రంగంలో ఉంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. నంద్యాల నియోజకవర్గం తమ పార్టీ దని అందుకే అక్కడి నుండి పోటీ చేస్తామని ఆ పార్టీ స్పష్టం చేసింది.  వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి గెలిచి తెలుగుదేశం  పార్టీలో చేరిన భూమా నాగిరెడ్డి మరణంతో ఏర్పడిన ఖాళీ కాబట్టి తమ పార్టీకి చెందిన స్థానంలో  తిరిగి  తమ పార్టీ తరపున అభ్యర్థిని దింపడం సమంజసమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్తోంది. మరో వైపు నంద్యాల అసెంబ్లీ టికెట్ విషయంలో భూమా కుటుంబంలోనే పోటీ ఎక్కువగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *