ఆర్కే నగర్ ఉప ఎన్నిక వాయిదా…?

తమిళనాడు ఆర్.కే.నగర్ అసెంబ్లీ ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ ఎన్నికను వాయిదా వేయాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు తెలుస్తోంది.  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్.కే.నగర్ ఉప ఎన్నిక ఈనెల 12న జరగనుంది. అధికార అన్నాడీఎంకే తో పాటుగా పన్నీరు సెల్వం, విపక్ష డీఎంకే కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అన్ని పార్టీలు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరుగుతోంది. జయలలిత మేనకోడలు దీపతో సహా మొత్తం 62 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. అర్.కే.నగర్ ఉప ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసినట్టుగా చెప్తున్న దాదాపు 90 కోట్ల రూపాయలను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర మంత్రి విజయ్ భాస్కర్, ప్రముఖ నటుడు శరత్ కుమార్ తో సహా పలువురి నివాసాలు, కార్యాలయాలపై ఐటి దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంలో పెద్ద మొత్తంలో లెక్కలు చూపని ధనం లభ్యమైంది.
అన్ని వర్గాలు అర్.కే.నగర్ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా భావించి విచ్చల విడిగా డబ్బు పంపిణీ చేయడంతో పాటుగా అధికార దుర్వినియోగంపై పెద్ద ఎత్తున ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వస్తున్నాయి. అధికార పార్టీకి ఈ ఉప ఎన్నికలు చావో రేవో అన్న చందంగా మారడంతో ఆ పార్టీ ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. అటు పన్నీరు సెల్వం వర్గం కూడా ఎన్నికల్లో గెలడానికి విశ్వప్రయత్నాలు చేస్తుండడంతో ఈ ఎన్నికల నిర్వహణ ఎన్నికల సంఘానికి తలకు మించిన భారంగా తయారయింది. ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికలను కొంత కాలం పాటు వాయిదా వేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *