అధ్వానీ కీలక ప్రకటన

రాష్ట్రపతి పదవి రేసులో తాను లేనని బీజేపీ అగ్రనేత ఎల్.కే.అధ్వానీ స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి ఎల్.కే.అధ్వానీ పోటీ చేస్తారంటూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం దీనితో తెరపడినట్టయింది. తాను రాష్ట్రపతి పదవికోసం పోటీ పడడంలేదంటూ అధ్వానీ తేల్చిచెప్పేశారు. బాబ్రీమసీదు కుట్ర కేసులో అధ్వానీని విచారించాల్సిందేనంటూ సీబీఐ సుప్రీంకోర్టును అభ్యర్థించిన మరుసటి రోజే అధ్వానీ ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం. పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడిన అధ్వానీ తాను రాష్ట్రపతి పదవికోసం రేస్  లో లేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రపతి పదవికోసం తాను ఎప్పుడూ ప్రయత్నం చేయలేదని తనకు ఆ ఉద్దేశం  కూడా లేదని చెప్పారు.
బీజేపీ సీనియర్ నేత అధ్వానీ ప్రభ పార్టీలో తగ్గిపోయింది. ఒకప్పుడు బీజేపీలో తిరుగులేని నేతగా ఉన్న అధ్వానీ ప్రస్తుతం మోడీ ప్రభంజనం లో మసకబారిపోయారనే చెప్పాలి. ఈ క్రమంలో బీజేపీలోని అత్యంత సీనియర్ నేత అయిన అధ్వానీని రాష్ట్రపతి పదవికి మోడీ సిఫార్సు చేసినట్టు వార్తలు వచ్చాయి. తాను తన గురువు అధ్వానీని మర్చిపోలేదని ఆయన్ను సముచితంగా గౌరవిస్తామని మోడీ పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. అధ్వానీతో పాటుగా ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భగవత్ పేరు కూడా రాష్ట్రపతి పదవి రేసులో ఉన్నట్టు ప్రచారం సాగినా దాన్ని భగవత్ కొట్టిపడేశారు. తాను రాష్ట్రపతి పదవి కోసం పోటీ పడడంలేదని ఆయన ప్రకటించారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగుస్తుండడంతో ఈ సంవత్సరం జులైలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *