ఈవీఎంలపై రాజ్యసభలో వాడీవేడీ చర్చ

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ల పై రాజ్యసభలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈవీఎం లను వెంటనే రద్దు చేసిన బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ లు డిమాండ్ చేశాయి. ఎవీఎంల వల్ల అక్రమాలు పెరిగిపోతున్నాయని విపక్షాలు ఆరోపించాయి. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంల అక్రమాలు జరిగాయని అక్రమ పద్దతుల్లోనే బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని విపక్షాలు ఆరోపించాయి. విపక్షాల ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఈవీఎంలలో అక్రమాలు జరిగే ఆస్కారం లేదని తెల్చిచెప్పింది. బీహార్, పంజాబ్, ఢిల్లీలో బీజేపీ ఓడిపోయినప్పుడు ఈవీఎం అక్రమాల గురించి విపక్షాలు ఎందుకు నోరు మెదపలేదని బీజేపీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి అబ్బాస్ నక్వీ ప్రశ్నించారు. బీజేపీ గెలుపుని జీర్ణించుకోలేని విపక్షాలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. బీజేపీ ఈవీఎంలలో అక్రమాలకు పాల్పడితే అన్ని రాష్ట్రాల ఎన్నికల్లోనూ గెలిచి ఉండేదన్నారు. ఈవీఎంల వాడకం గురించి పార్లమెంటులో చర్చించడం సరైందికాదని దీనిపై ఎన్నికల సంఘాన్ని కలవాలని బీజేపీ సూచించింది.
ఈవీఎంల ద్వారా అక్రమాలకు పాల్పడి బీజేపీ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ సభ్యుడు గలాం నబీ ఆజాద్ ఆరోపించారు. ఈవీఎంల పనితీరుపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ ను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ లో ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే పడిన విషయం వెలుగులోకి వచ్చిన సంగతిని ఆజాద్ గుర్తు చేశారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని వక్రమార్గాల్లో అధికారాన్ని కైవసం చేసుకుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా ఆరోపించారు. ఈ అంశంపై అధికార విపక్ష సభ్యులు తీవ్ర వాదోపవాదాలకు దిగారు. ఈ అంశంపై సమగ్ర చర్చకు అనుమతించాలంటూ విపక్షాలు వెల్ లోకి వచ్చి ఆందోళనకు దిగడంతో సభను డిప్యూటీ ఛైర్మన్ వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *