పాలలో నీళ్లు కలపడం మనకు తెలిసిందే… మరికొందరు పాలలో పాల పౌడర్ ను కలిసి వాటిని చిక్కగా తయారు చేయడం ద్వారా పాలను కల్తీ చేస్తున్నారు. ఇది ఒక ఎత్తయితే కొంత మంది మరీ బరితెగించి యూరియా, రసాయనాలతో నకిలీ పాలు తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. ఆరోగ్యం కోసం తాగే పాలను విషతుల్యం చేస్తున్నారు. ఈ పాలను తాగితే అంతే సంగతులు లేని రోగాలను కొని తెచ్చుకోవడమే… కాసుల కోసం కక్కూర్తి పడిన కొంత మంది వ్యాపారులు చేస్తున్న ఈ చర్యల వల్ల అనేక మంది అమాయకుల ఆరోగ్యాలు పాడవుతున్నాయి. పాలను విషయంగా తయారు చేస్తున్న వీరి వల్ల చిన్నా పెద్దా తేడా లేకుండా రోగాల బారిన పడుతున్నారు. వీరి కక్కూర్తి వల్ల ఈ పాలు తాగిన వారి ప్రాణాల మీదకు వస్తోంది.
నగరంలోని పలు చోట్ల ఈ నకిలీ పాల తయారీ యాధేచ్చగా జరుగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యావహారం వ్యాపారులకు కాసులు కురిపిస్తుండగా వినియోగదారులు మాత్రం రోగాల బారిన పడుతున్నారు. రసయనాలతో తయారు చేసిన పాలు అత్యంత ప్రమాదకరమని వీటి వల్ల అనేక రోగాలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. నకిలీ పాల తయారీ దారులపై పోలీసులు కూడా ఉక్కుపాదం మోపుతున్నా ఫలితం లేకుండా పోయింది. నగర శివార్లు, పాతబస్తీలో ఈ తరహా తయారీ కేంద్రాలు ఉన్నట్టు తెలుస్తోంది.
నకిలీ పాల తయారీ కేంద్రాలను గుర్తించిన పోలీసులు దాడులు చేసి అరెస్టులు చేస్తున్నా ఈ ప్రమాదకర వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. రసాయనాలతో పాలను తయారు చేస్తునన ఇద్దరిని తాజాగా రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో పాల తయారీకీ ఉపయోగించే రసాయనాలు, యూనియా స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం మండలం మంఖాల్ గ్రామంలో నకిలీ పాల తయారీ జరుగుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడిచేశారు. ఈ పాలను వీరు పహాడీషరీఫ్, తుక్కుగూడ, మహేశ్వరంతో పాటు జల్పల్లి, పాతబస్తీలోని హోటళ్లకు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో కృష్ణాయాదవ్, మల్లేష్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.