కట్టప్ప… పరిచయం అక్కరలేని పేరు… బాహుబలి సినిమాలో హీరోతో సమానంగా కట్టప్ప పేరు కూడా మారుమోగిపోయింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. కట్టప్పపై కర్ణాటక ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇంతకీ వారి కోపం కట్టప్ప బాహుబలిని చంపినందుకు కాదు. కట్టప్ప పాత్రనుపోషించిన సత్యరాజ్ పై వారి కోపం అంతా. సత్యరాజ్ కట్టప్పగా నటించిన బాహుబలి-2 ను కర్ణాటక ప్రాంతంలో విడుదల కాకుండా అడ్డుకుంటామంటూ కన్నడ సంఘాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
ఇంతకీ సత్యరాజ్ పై వారి కోపానికి కారణం కావేరీ జల వివాదమేనట. తమిళనాడు-కర్ణాటకల మధ్య కావేరీ జల వివాదం రాజుకున్న సమయంలో సత్యరాజ్ కర్ణాటకను చులకన చేస్తూ మాట్లాడాడని ఇప్పుడు అతను నటించిన చీత్రాన్ని తాము అడ్డుకుంటామంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చాయి కొన్ని సంస్థలు. సత్యరాజ్ కు వ్యతిరేకంగా ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నాయి.