జర్మనీలోని ప్రముఖ ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయంలో భారతీయురాలిపట్ల అక్కడి భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు దారుణంగా ఉంది. భద్రత పేరుతో మహిళ బట్టలు విప్పాల్సిందిగా అక్కడి సిబ్బంది బలవంతం పెట్టి ఆమెను దారుణంగా అవమానించారు. తనకు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సదరు మహిళ ఫేస్ బుక్ లో ఉంచింది. మార్చి 29న బెంగళూరుకు చెందిన శృతిబసప్ప ఐస్ ల్యాండ్ కు చెందిన తన భర్తతో ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయానికి వచ్చింది. ఇటీవల ఆమెకు శస్త్ర చికిత్స జరగడంతో బాడీ స్కానింగ్ వద్ద మెటల్ డిటెక్టర్ మోగింది. తనకు ఇటీవలే శస్త్ర చికిత్స జరిగిందని ఆమె చికిత్సకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు అందచేసినప్పటికీ వారు వినలేదని తనను బట్టలు విప్పాల్సిందిగా బలవంతం పెట్టారని బాధిత మహిళ చెప్పింది. బట్టలు విప్పడానికి నిరాకరించి తన భర్తను పిలిచానని శ్వేత జాతీయుడైన తన భర్త రావడంతో అక్కడి సిబ్బంది వ్యవహార శైలిలో మార్పు వచ్చిందని ఆ మహిళ తెలిపింది.
అప్పటివరకు తనను యక్షప్రశ్నలు వేసి వేధించిన వారు శ్వేతజాతీయుడైన తన భర్త వచ్చిన వెంటనే తనను పంపించివేశారని అన్నారు. తన భర్త తన వెంట లేకుండా తన పరిస్థితి మరో విధంగా ఉండేదని శృతి అంటోంది. అనేక విమానాశ్రయాల్లో ఇదే పరిస్థితి ఉందని శ్వేత జాతీయులను ఒక లాగా ఇతరులను మరోలాగా చూస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె చేసిన పోస్టుపై ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయ అధికారులు స్పందించారు. తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామని జాతి వివక్షతను తాము సహించబోమని అంటూ ఈ ఘటనపై పూర్తి విచారణ జరుపుతాని చెప్పారు.