మన వేలితో మన కంటినే పొడుస్తున్న తీవ్రవాదులు

జమ్ము కాశ్మీర్ లో తీవ్రవాదులు అనుసరిస్తున్న కొత్త వ్యూహాలు భద్రతా దళాలకు తలనొప్పిగా మారింది. స్థానిక యువకులను తమకు అనుకూలం మార్చుకుంటున్న తీవ్రవాదులు వారిని మానవ కవచాలుగా ఉపయోగించుకుంటున్నారు. దీనితో కొన్ని సార్లు భద్రతాదళాల చేతుల్లో స్థానిక యువకులు ప్రాణాలు కోల్పోతుండడం భద్రతా బలగాలకు సమస్యగా మారింది. స్థానికులు ప్రాణాలు కోల్పోతుండడంతో బలగాలపై  వ్యతిరేకత పెరుగుతోంది. సైనికులు ,పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ స్థానికులు మాత్రం తీవ్రవాదులకు మద్దతుగా సైనికులు, పోలీసులపై దాడులకు దిగుతున్నారు. దీనితో విధిలేని పరిస్థితుల్లో భద్రతా దళాలు జరుపుతన్న కాల్పుల్లో కొందరు అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిణామం భద్రతా దళాలకు ఇబ్బందిగా మారింది.
భద్రతా దళాలకు , తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్న సందర్భంలో స్థానికులు గుమిగూడి సైనికులపై రాళ్లదాడులు చేస్తున్నారు. పోలీసుల సహాయంతో స్థానికులను సైన్యం చెదరగొట్టినప్పటికీ చాలా సార్లు దాళ్లదాడులు భీకరంగా జరుగుతున్నాయి.  పెద్ద ఎత్తున పోగైన స్థానిక యువకులు సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని రాళ్లతో విరుచుకుని పడుతున్నారు. స్థానికులను మానవకవచాలుగా ఉపయోగించుకుని తీవ్రవాదులు వారి సహాయంతో తప్పించుకుని పోతున్నారు. చాలా సార్లు మన బగాలు సంయవనం పాటించినప్పటికీ కొన్ని సార్లు స్థానికులపై కూడా కాల్పులు జరపక తప్పని పరిస్థితి. ఈ కాల్పుల్లో స్థానిక యువకులు మరణిస్తుండడంతో సైన్యానికి వ్యతిరేకంగా మరింత మందిని తీవ్రవాద సంస్థలు ఎగదోస్తున్నాయి.
ఇటీవల కాలంలో సైనికులపై తీవ్రవాదుల, స్థానికుల దాడులు గణనీయంగా పెరిగిపోయాయి. గతంలో కంటే ఇటీవల కాలంలో సైనికులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల సంఖ్య పెరిగిపోయింది. ఇటు కొందరు స్థానిక యువకులు కూడా తీవ్రవాదులకు మద్దతు పలుకుతుండడం దురదృష్టకరం. ఎన్ కౌంటర్ జరుగుతున్న ప్రాంతానికి క్షణాల్లో పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకుంటున్నారు. దీని కోసం వాట్సప్ గ్రూపులు, ఫేస్ బుక్  లను తీవ్రవాద సంస్థలు ఉపయోగిస్తున్నాయి. సరిహద్దులకు ఆవతలి నుండి ఈ గ్రూపులను నిర్వహిస్తున్నారు. స్థానిక యువకులను తమవైపు తిప్పుకునేందుకు రకరకాల ప్రలోభాలకు గురిచేస్తున్నారు. స్థానికంగా కాస్త పట్టున్న యువకులను తమ వైపు తిప్పుకుని భారత యువకులతోనే మన సైన్యం పైకి ఉసిగొల్పుతున్నారు.
అమాయకులను మానవ కవచాలుగా ఉపయోగించుకోవడం ప్రపంచంలోని అన్ని తీవ్రవాద సంస్థలు చేసేవే. అయితే కాశ్మీర్ లో ఈ తరహా చర్యలు ఇటీవలి కాలంలోనే ఎక్కువ అయ్యాయని సైనిక అధికారులు చెప్తున్నారు. స్థానిక యువకులు తీవ్రవాదులకు మద్దతుగా తమ పైకి రాళ్లదాడులు చేయడం ఇబ్బందిని కలిగిస్తోందని తాము ఎంత నిగ్రహాంతో ఉన్నా వారు కవ్వింపు చర్యలకు దిగుతున్నారని సైనికాధికారులు చెప్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులకు దిగాల్సి వస్తోందని అమాయక ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తాము ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొన్నిసార్లు అవి ఫలిచడంలేదని వారు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *