ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 10వ తరగతి ప్రశ్నా పత్రం లీకేజీ వ్యవహారంపై జరిగిన చర్చ పక్కదారి పట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విపక్ష నేత జగన్ పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. జగన్ ఎక్కడ చదివాడో తెలియదని అసలు ఆయన సరిగా పరిక్షలు రాసిన వ్యక్తికాదని చంద్రబాబు ఆరోపించారు. తాను వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ ఎకనామిక్స్ చదివానని, ఎంఫిల్ చేశానని చెప్పారు. దీనికి స్పందించిన జగన్ తాను బేంగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివానని కావాలంటే విచారించుకోవచ్చని చెప్పారు. చంద్రబాబు మాదిరిగా వచ్చిరాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ లో చదవలేదన్నారు. తాను 10వతరగతి, ఇంటర్, డిగ్రీలలో ఫస్ట్ క్లాస్ స్టూండెంట్ నని చెప్పారు. చంద్రబాబు ఎంఫిల్ చేయకుండానే చేసినట్టు అబద్దపు ప్రచారాలు చేసుకుంటున్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబుకు ఇంగ్లీష్ రాదని ఈ విషయం ఎవరిని అడిగినా చెప్తారని అన్నారు.
మరో వైపు పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని జగన్ ఆరోపించారు. మంత్రి నారాయణకు చెందిన స్కూల్ కావడం వల్లే సరైన చర్యలు తీసుకోవడం లేదని ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ అది నారాయణ స్కూల్ అయినప్పటికీ అక్కడ ఉన్న సిబ్బంది నారాయణ సంస్థలకు చెందినవారు కాదన్నారు. పశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోబోమని దీని వెనుక ఎవరు ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు.