దేశవ్యాప్తంగా రానున్నది మండే కాలమే నంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎండలు మరింత తీవ్రం అవుతాయని దానికి తోడు వడగాలల తీవ్రత ఎక్కువ అవుతుందని వాతావరణ శాఖ చెప్తోంది. వడగాలుల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఎండకాలంలో సాధరణం కన్నా ఎక్కువగా ఎండలు కాస్తాయని చెప్తున్నారు. సాధరణ ఉష్ణోగ్రత కన్నా నాలుగు నుండి ఐదు డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనితో పాటుగా వాతావరణంలో తేమ శాతం చాలా తక్కువగా ఉండడం వల్ల ఉక్క పెరుగుతుందని అంటున్నారు. సూర్యుడి కిరణాలు నిటారుగా నేలను తాకుతుండడం వల్ల ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోందని అంటున్నారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున రానున్న రోజుల్లో అప్రమత్తంగా ఉండాలని జాతీయ విపత్తుల సంస్థకు వాతావరణ శాఖ సూచించింది. వేసవి తీవ్రత వల్ల వడదెబ్బలు తగిలే అవకాశం ఎక్కువగా ఉందని అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజల్లో అవగాహనకల్పించాలని సూచించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటుగా మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఓడిశా రాష్ట్రాలని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.
మహారాష్ట్రాల ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ఎండ తీవ్రతకు అక్కడ ఒక్కరోజులోనే ఐదుగురు మరణించారు.