పొరుగు రాష్ట్రం తమిళ తంబీలను ఆదర్శంగా తీసుకున్నారో ఏమో ఏపీ ఎమ్మెల్యేలు కూడా తామేం తక్కువ తినలేదంటూ సభలో రచ్చ, రచ్చ చేస్తున్నారు. సభలో దూషణల పర్వం, తేల్చుకుందాం రా అంటూ బూతులు తిట్టుకోవడంతో పాటుగా ఏకంగా స్పీకర్ పోడియంను ఎక్కి నిరసన తెలిపిన విపక్ష ఎమ్మెల్యేలు పోడియం పైకి ఎక్కి నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. స్పీకర్ కు అటు, ఇటు నిల్చున్న వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ నిలబడడంతో స్పీకర్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది.
పదవతరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై చర్చకు వైసీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఈ వ్యవహారంలో మంత్రి నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థల హస్తం ఉందనేది వైసీపీ వాదన. ఈ అంశంపై చర్చకు పట్టుపట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు సభకార్యక్రమాలకు అడ్డుతగలడంతో సభను తొలుత స్పీకర్ వాయిదా వేశాడు. తిరిగి సభ సమావేశమైనా ఎటువంటి మార్పు లేదు. ఈ సారి ఏకంగా స్పీకర్ పోడియం పైకి ఎక్కి నినాదాలు చేయడంతో సభను తిరిగి వాయిదా వేయాల్సి వచ్చింది. సభలో వైసీపీ ప్రవర్తన దారుణంగా ఉందని అధికార టీడీపీ ఆరోపిస్తుండగా అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతునొక్కుతున్నారని వైసీపీ సభ్యులు అంటున్నారు.