తెలంగాణ రాష్ట్రానికి ఈ సంవత్సరం అన్ని శుభఫలితాలే ఉంటాయని పండితులు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనహితలో నిర్వహించిన ఉగాది పంచాగ శ్రవణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా పలువురు మంత్రులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శృంగేరి పీఠానికి చెందిన బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాగ శ్రవణం చేశారు. ఈ సంవత్సరం భారత దేశ కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం అవుతాయని భారత్ అన్ని రంగాల్లోనూ అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందని చెప్పారు. భారత్ తో పాటుగా తెలంగాణ రాష్ట్రం శుభిక్షంగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో వర్షాలు సకాలంలో కురుస్తాయని చెప్పారు. పంటలు బాగా పండుతాయని దీనితో ధరలు అదుపులో ఉంటాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు విజయవంతం అవుతాయని అన్నారు.
ఈ సంవత్సరం సాఫ్ట్ వేర్ రంగం మందకోడిగా ఉంటుందన్నారు. ఇతర రంగాలు పుంజుకుంటాయని చెప్పారు. ఆగస్టు నుండి అక్టోబర్ మధ్య కాలంలో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉన్నందులు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కొత్త సంవత్సరం ప్రజలకు సుఖ శాంతులు తీసుకుని రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలషించారు. పండితులు కూడా ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పడం శుభ సూచకమన్నారు. రాష్ట్రం అభివృద్దిలో అగ్రగామిగా ఉంటుందని సీఎం అన్నారు.