ఉగ్రవాద చర్యలను ఉపేక్షించేది లేదని కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.మధ్యప్రదేశ్లోని తేకన్పూర్ బీఎస్ఎఫ్ అకాడమీలో జరిగిన పాసింగ్అవుట్ పరేడ్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ భారత్ ను దెబ్బతీయాలని కుట్రలు పన్నుతోందన్నారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా భారత్ ను ఏమీ చేయలేరన్నారు. ఉగ్రవాద సమస్యని ధీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. సరిహద్దుల్లో చొరబాట్లు భారత్ కు తలనొప్పిగా మారాయని త్వరలో సరిహద్దుల్లో పూర్తిగా కంచెను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాకిస్థాన్ సరిహద్దుతో పాటుగా బాంగ్లా సరిహద్దులను కూడా మూసేస్తామని చెప్పారు. ఉగ్రవాద సమస్య నుండి బయటపడేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.
సరిహద్దుల్లో చాలా చోట్ల కంటె సరిగా లేదని ఈ కారణం వల్ల భారత్ లోకి చొరబాట్లు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ సమస్యను అధిగమించడానికి సరిహద్దులను పూర్తిగా మూసేస్తామని చెప్పారు.