యూపీ సీఎం ను కలిసిన ములాయం కుమారుడు

ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలవడం సంచలనం రేపుతోంది. భార్య అపర్ణతో కలిసి వచ్చిన ప్రతీక్ యాదవ్ ముఖ్యమంత్రి అతిధిగృహంలో ఆయనతో ఆరగంట పాటు భేటీ అయ్యారు. ఇది సాధారణ భేటీగానేే ఇరు వర్గాలు చెప్తున్నప్పటికీ వీరి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సమాజ్ వాదీ పార్టీలో అంతర్గత పోరు, సోదరుడు అఖిలేష్ యాదవ్ తో విభేదాల నేపధ్యంలో ప్రతీక్ యాదవ్ యూపీ సీఎంను కలవడం పై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఎన్నికలకు ముందు సమాజ్ వాదీ పార్టీలో జరిగిన అంతర్గత పోరులో ములాయం సింగ్ యావద్ తో విభేదించిన కుమారుడు అఖిలేష్ తండ్రి పైనే తిరుగుబాటు బావుటా ఎగరేశాడు. ఈ సమయంలో ప్రతీక్ తండ్రికి బాసటగా నిల్చాడు. అఖిలేష్ కు సవతి సోదరుడైన ప్రతీక్ తో అఖిలేష్ ను ప్రతీక్ బాహాటంగా వ్యతిరేకించపోయినా తెరవెనుక అఖిలేష్ వ్యతిరేకులకు మద్దతునిచ్చాడు.
ఎన్నికలకు ముందు కుటుంబంలో విభేదాలు లేవంటూ అంతా కలిపి ఐక్యాతా రాగం ఆందుకున్నా అప్పటికే సమాజ్ వాదీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రతీక్ భార్య అపర్ణ యాదవ్ లక్నో కంటోన్మెంట్ స్థానం నుండి పోటీ చేశారు. ఇక్కడ అఖిలేష్ భార్య డింపుల్ అపర్ణతో కలిసి ప్రచారం నిర్వహించి కుటుంబంలో విభేదాలు లేవని చాటిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ స్థానం నుండి అపర్ణ ఓడిపోయారు. బీజేపీ పై ఒంటికాలిపై లేచే ములాయం సింగ్ యావద్ కోడలు అపర్ణ గతంలోనూ మోడీకి అనుకూలంగా మాట్లాడారు. ఆమె మోడీతో సెల్ఫీ దిగడాన్ని కొంత మంది తప్పుపట్టినప్పటికీ మోడీ దేశానికి ప్రధాని అంటూ విమర్శకుల నోళ్లు మూయించిన అపర్ణ ఇప్పుడు యూపీ సీఎంను కలవడం విశేషం. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా మోడీ చెవులో చాలా సేపు ములాయం గుసగుసలాడగా ఇప్పుడు ఆయన కుమారుడు యూపీ సీఎంను కలవడం రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు తెరతీస్తోంది.
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *