పాక్ లో పుట్టి భారత్ లో వైరల్ అయిన జవాను పోస్టు

jawan1

సరిహద్దుల్లో జవాన్లకు అందచేస్తున్న ఆహరం నాణ్యంగా లేదంటూ ఆరోపణలు చేసిన బీఎస్ఎఫ్ జవాను తేజ్‌బహదూర్‌ యాదవ్‌ చనిపోయడంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తలో వాస్తవం లేదని తెలిసింది. సరిహద్దుల్లో పనిచేసే తమకు నాణ్యమైన ఆహారం అందచేయడం లేదని తేజ్ బహదూర్ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ సాగింది. ప్రధాని కార్యాలయం కూడా ఈ పోస్టుపై స్పందించింది. ఆ తరువాత తేజ్ బహదూర్ పై బీఎస్ఎఫ్ అధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో తేజ్ బహదూర్ చనిపోయాడంటూ ఒక ఫొటో సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చింది. సైన్యంలో లోపాలను ఎత్తిచూపిన తేజ్ బహదూర్ చనిపోయాడనేది ఆ పోస్టు సారాంశం. ఇది కూడా వైరల్ గా మారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక మంది కామెంట్లు చేశారు.

అయితే తేజ్ బహదూర్ ఆరోగ్యంగానే ఉన్నాడని బీఎస్ఎఫ్ అధికారులు స్పష్టం చేేశారు. ఆ ఫొటో అసలు తేజ్ బహదూర్ దే కాని స్పష్టం చేశారు. ప్రస్తుతం  సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్నది హీరావల్లభ్ భట్ అనే సీఆర్పీఎఫ్ అధికారిదని తేలింది. ఇటీవల జార్ఘండ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆయన మృతి చెందాడు. అయితే అసలు ఈ పోస్టు ఎక్కడ మొదలైందనేది ఆరా తీయగా పాకిస్థాన్ లో దాని మూలాలు బయట పడ్డాయి. పాకిస్థాన్ కు చెందిన ఒక వ్యక్తి ట్విట్టర్ అకౌంట్ లో ఈ అబద్దపు వార్తను పెట్టాడు. సరిహద్దు భద్రతా బలగాలకు సరైన ఆహారం పెట్టలేదని ఆరోపణలు చేసిన జవాన్ ను సైన్యమే చంపేసిందనేది దీని సారాంశం. ఎక్కడో సరిహద్దు అవతల పుట్టిన వార్త భారత్ లో వైరల్ మారింది.