మత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడి

తెలంగాణలో మతపర రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీజేపీ తన ఆందోళన తీవ్రతను పెంచింది. మతపరర రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీజేపీ యువమోర్చ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వాగా సభలో బీజేపీ సభ్యులు మత రిజర్వేషన్లపై ఆందోళన వ్యక్తం చేస్తూ చర్చకు పట్టుపట్టారు. ఈ అంశంపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని అనుమతించాలంటూ బీజేపీ సభ్యులు ఆందోళన చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీనితో బీజేపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారు.
బీజేవైఎం పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అసెంబ్లీ వైపు దూసుకుని వచ్చేందుకు ప్రయత్నించిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో బీజేవైఎం కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రభుత్వానికి, ముస్లీం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపు దూసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. ముట్టడిని అడ్డుకునే క్రమంలో  అసెంబ్లీ వైపు దారితీసే అన్ని మార్గాల్లో పోలీసు బలగాలను మోహరించారు. అదనపు బలగాలను సిద్దం చేశారు. బ్యారికేడ్లను, ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. బషీర్ బాగ్ , లకీడాపూల్ వైపు నుండి ఆందోళన కారులు అసెంబ్లీనీ ముట్టడించవచ్చనే సమాచారం మేరకు ఈ రెండు దారులను పూర్తిగా పోలీసులు తమ అదుపులోకి తెచ్చుకున్నారు. నగర శివారు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. అసెంబ్లీ పరిసరాల్లోకి ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజల హక్కులను హరిస్తోందని బీజేపీ నేేత కిషన్ రెడ్డి ఆరోపించారు. ధర్నాలు చేయడం ప్రజల హక్కని ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపే కనీస హక్కులను కాలరాయడం సరైంది కాదన్నారు. ఇందిరా పార్క్ నుండి ధర్నా చౌక్ ను తరలించడంతో పాటుగా నిరసన కార్యక్రమాలను పోలీసుల సహాయంతో ఉక్కుపాదంతో అణచివేసే ప్రయత్నాలు చేయడం పై కిషన్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ లోపల, బయట ప్రభుత్వం తన మాటే చెల్లాలనే మొండి ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *