బెంగళూరులో లైంగిక వేధింపులు

దేశ ఐటీ రాజధాని బెంగళూరులో మహిళలపై లైంగిక దాడులు సాథరణంగా మారాయి. దేశ రాజధానిని మించి బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. నగరంలోని విజయానగర్  లో జరిగిన ఒక ఘటన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఇద్దరు మహిళలు నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ పై వారిని వెంబడిస్తూ వచ్చిన ఇద్దరి యువకుల్లో వెనక కూర్చున్న వ్యక్తి ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారాడంతో బెంగళూరులో మహిళల రక్షణకు సంబంధించి మరోమారు చర్చ జరుగుతోంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా లైంగిక వేధింపుల ఘటనలపై దేశవ్యాప్తంగా చర్చ జరగ్గా తాజాగా ఈ ఘటనతో మరోసారి మహిళా భద్రతా అంశం తెరపైకి వచ్చింది. 

   ఈ ఘటనకు సంబంధించి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కనిపించిన దృశ్యాల ఆధారంగా కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకులు దొంగతనానికి ప్రయత్నించారా లేక మహిళలను వేధించడానికి యత్నించారా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ వీడియోను ఎవరు అప్ లోడ్ చేశారో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.