ఏపీ కొత్త మంత్రులు ఎవరు…?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం అయింది. మంత్రి వర్గ విస్తరణలో ఎంత మంది కొత్తవారికి చోటు దక్కుతుంది, పాత వారిలో ఎంతమందిపై వేటు పడుతుంది ఆనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కొంత మంది మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. సరిగా పనిచేయకపోవడంతో పాటుగా వివాదాల్లో ఇరుక్కుంటున్న మంత్రులు వ్యవహార శైలిపై సీఎం ఇప్పటికే పలుసార్లు హెచ్చరించారు. కొందరు మంత్రులను బాహాటంగానే చంద్రబాబు హెచ్చరించిన నేపధ్యంలో కొందరు మంత్రులపై వేటు పడకతప్పదని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయం అయిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి వెళ్లడించిన నేపధ్యంలో లోకేష్ తో పాటుగా ఇంకా ఎవరెవరు మంత్రి వర్గంలోకి వస్తారనేదానిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. శ్రీకాకుళం నుండి కిమిడి కళా వెంకట్రావు,  కర్నూలు జిల్లా నుండి భూమా అఖిల ప్రియ,  నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర యాదవ్, చిత్తూరుకు చెందిన అమర్ నాధ్ రెడ్డిల కు అవకాశం లభించవచ్నుచు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ షరీఫ్ కు కూడా అవకాశం ఉన్నట్టు సమాచారం.  వీరితో పాటుగా డొక్కా మాణిక్య వరప్రసాద్, పయ్యావుల కేశవ్, మాగుంట శ్రీనివాసరెడ్డి లకు అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
ప్రస్తుతం మంత్రులుగా ఉన్న  పీతల సుజాత, కిమిడి మృణాళిని, కొల్లు రవీంద్ర, రావెల కిషోర్ బాబు, బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, పల్లె రఘునాధరెడ్డిలకు పదవీ గండం ఉన్నదనే ప్రచారం సాగుతోంది.
మంత్రి వర్గంలో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవులు ఖాయం అయిపోయాయంటూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. కొత్తగా ఎంత మందిని క్యాబినెట్ లోకి తీసుకోవాలని. ఎవరెవరెకి చోటు కల్పించాలని అనే అంశంపై సీఎం జోరుగా కసరత్తులు చేస్తున్నారు. వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా మంత్రిపదవులను ఆశిస్తున్న నేపధ్యంలో పార్టీ మారిన వారికి మంత్రి పదవులు ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. పార్టీలు మారిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం వల్ల పార్టీ చెడ్డపేరు వస్తుందని, కోర్టు తీర్పుల నేపధ్యంలో పార్టీలు మారిన వారికి మంత్రి పదవుల విషయంలో సీఎం ఆచీతూచీ వ్యవహరించే అవకాశం ఉంది. అయితే ఒక వేళ వారికి మంత్రి పదవులు ఇవ్వని పక్షంలో ఎమ్మెల్యేలు తిరిగి స్వంత గూటికి చేరే అవకాశాలు కూడా లేకపోలేదనే వార్తలు వస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.
ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29వరకు ఉంది. ఆ తరువాత నారా లోకేష్ తో సహా కొత్తగా ఎంపికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తరువాత ఎప్పుడైనా క్యాబినెట్ విస్తరణకు అవకాశం ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *