ఏపీ సీఎం నివాసం వద్ద కొండచిలువ

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడి ఇంటి సమీపంలో కొండచిలువ కొద్దిసేపు అధికారులను హైరానా పెట్టింది. సీఎం నివాసం సమీపంలో అధికారులు నిత్యం భద్రతా చర్యల్లో భాగంగా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో భద్రతా ఆధికారులకు సుమారు ఆరు అడుగులకు పైగా పొడవున్న కొండచిలువ కనిపించింది. దీనితో వారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి కొండచిలువను పట్టుకున్నారు. మంగళగిరి కొండ ప్రాంతంలో దాన్ని విడిచిపెట్టారు.  ప్రకాశం బ్యారేజీ దాటిన తరువాత కరకట్ట నుంచి సీఎం నివాసానికి వెళ్లే దారిలో ఈ కొండచిలువ కనిపించింది. కరకట్టకు ఇరువైపులా ప్రతిరోజు భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో వారికి ఈ కొండచిలువ కనిపించింది. ఒక కోడిని తినే క్రమంలో ఈ పాము వారి కంటపడింది. ఈ దారిలో మరో భారీ కొండచిలువను కూడా చూసినట్టు స్థానికులు తెలిపారు.