ప్రతీ చిన్న అవసరానికి కార్పేరేట్ ఆసుపత్రుల బాట పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ తన కుమారై కాన్పును ప్రభుత్వ ఆస్పత్రిలో చేయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. “కాన్పుకు రా తల్లి” అంటూ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా తన కుతురిని కూడా హైదరాబాద్ నుండి పుట్టింటికి పిలిపించుకున్న జయశంకర్ జిల్లా కలెక్టర్ మురళి ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో తన కూతురుకు పురుడు పోయించారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న తన కూతురు ప్రగతిని భూపాలపల్లికి పిల్చుకుని వచ్చిన కలెక్టర్ మురళి దంపుతులు స్థానిక ములుగు ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రగతికి థైరాయిడ్ సమస్య ఉండడంతో ఆపరేషన్ తప్పదని వైద్యులు చెప్పడంతో ములుగు ఆస్పత్రిలోనే ఆపరేషన్ నిర్వహించారు. ప్రగటి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారు. తన మనవరానికి ఎత్తుకుని ముద్దాడిని కలెక్టర్ మురళి ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించే చర్యలో భాగంగానే తన కూతురిని కాన్పు కోసం ఇక్కడికి తీసుకుని వచ్చినట్టు చెప్పారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల సౌకర్యాలు ఉంటాయని ప్రజలు నిర్భయంగా ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై అపనమ్మకంతో ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పోరేట్ ఆస్పత్రులను ధీటుగా తీర్చిదిద్దుతామన్నారు. నిపుణులైన వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచారని చెప్పారు.