ఉత్తర్ ప్రదేశ్ లోని చారిత్రక నగరం ఆగ్రాలో వరుసగా రెండు పేలుళ్లు జరిగాయి. పేలుళ్ల తీవ్రత తక్కువగా ఉండడంతో ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు. ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుళ్లు జరిగాయి. మొదటి పేలుడు స్టేషన్ కు సమీపంలోని ఒక ఇంటి పై కప్పుపై జరగ్గా రెండో పేలుడు రైల్వే ష్టేషన్ లోని చెత్తవేసే ప్రదేశంలో జరిగింది. ఈ రెండు పేలుళ్ల నేపధ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఘటనా స్థలానికి ఫొరెన్సిక్ నిపుణులు చేరుకుని పేలుడుకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. బాంబు పేలిన రైల్వే ష్టేషన్ కు 20 కిలోమీటర్ల దూరంలో అండమాన్ ఎక్స్ ప్రెస్ వస్తున్న సమయంలో ట్రాక్ పై భారీ బండరాయిని గుర్తించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడం భారీ ప్రమాదం తప్పింది. ట్రాక్ పై బండరాయి ఉంచిన ప్రదేశంలో ఉగ్రవాద చర్యలకు సంబంధించిన ఒక లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రైల్వే ట్రాప్ పై బండరాయి ఉంచడం, రైల్వే స్టేషన్ లో పేలుడు ఘటనల నేపధ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యాయి. భారీ ఎత్తున పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆగ్రాలోని అన్ని కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆగ్రాలోని తాజ్ మహల్ ను ఐఎస్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్టు వార్తలు వచ్చిన నేపధ్యంలో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. తాజ్ మహల్ లక్ష్యంగా ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఒక వీడియోను విడుదల చేయడం వెంటనే రైల్వే స్టేషన్ వద్ద పేలుడు ఘటనతో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.