గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడం తమ తప్పిదమేనని ఆ విషయంలో పార్టీ విఫలం అయిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఒప్పుకున్నారు. గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం పై దిగ్విజయ్ ను లక్ష్యంగా చేసుకుని జరగుతున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టడంతో పాటుగా కొందరు స్వపక్ష నేతలపై కూడా దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తప్పంతా తనదే అయినట్టు కొంత మంది నేతలు మాట్లాడుతున్న తీరు సరిగా లేదన్నారు. కేవలం గోవా కాంగ్రెస్ శాసనసభా పక్షనేతను ఎంపిక చేయకపోవడం వల్లే అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిదనేని నిజం కాదని అదే నిజమైతే ఇప్పటివరకు ఉత్తర్ ప్రదేశ్ లోకానీ, ఉత్తరా ఖండ్ లో కానీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గోవా ఫార్వర్డ్ పార్టీతో తమకు ఉన్న పొత్తు కొంత మంది పార్టీ నేతల వల్లే చెడిపోయిందని పొత్తు ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ సులభంగానే 22 సీట్లను సాధించుకుని స్వతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఉండేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. గోవా ఫార్వర్డ్ పార్టీ బేజేపీకి మద్దతు పలకడంతో ప్రభుత్వ ఏర్పాటుచేసే అవకాశాన్ని తాము కోల్పోయామన్నారు. గోవా గవర్నర్ కూడా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోలేదన్నారు. ఆయపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
అటు రాజ్యసభలోనూ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ల తీరుపై తీవ్రంగా విరుచుకు పడింది. గవర్నర్లను అడ్డంపెట్టుకుని గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఆ పార్టీ సభ్యులు సభలో ఆందోళన చేశారు. వెంటనే గోవా గవర్నర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభా కార్యక్రమాలకు కాంగ్రెస్ అడ్డుతగడంతో సభను వాయిదా వేయాల్సి వచ్చింది.