తెలంగాణలో జిల్లాల విభజన పై వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం వాస్తవ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ వేసిన ప్రశ్నకు జవాబుగా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని చెప్పారు. జిల్లాల విభజనను కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదని దీనివల్ల జిల్లాల విభజన నిర్ణయం పై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కివెళ్తోందంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అక్బరుద్దీన్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. మీడియాలో వస్తున్న వార్తలతో ప్రజలు తీవ్ర గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.
పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని కేసీఆర్ వెళ్లడించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోఖ్యం చేసుకోదని అన్నారు. జిల్లాల విషయంలో కొన్ని మీడియా సంస్థలు అనసర ప్రచారం చేస్తున్నాయని అవగాహనా రాహిత్యంతోనే ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. మీడియాలో వస్తున్న వార్తలను సీఎం ఖండించారు. జిల్లాల విభజన పూర్తయిందని ఇక అందులో ఎటువంటి మార్పులు చేర్పులు లేవని సీఎం స్పష్టం చేశారు.