గోవా,మణిపూర్ లలోనూ బీజేపీ పాగా

బీజేపీ తంత్రానికి కాంగ్రెస్ పార్టీ తలవంచక తప్పలేదు. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్ లో బారీ విజయాన్ని నమోదు చేసుకున్న కమలనాథులు గోవా, మణిపూర్ లలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. మెజార్టీ సీట్లుకు రాకపోయినా స్థానిక పార్టీల మద్దతు కూడగట్టుకోగలిగిన బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రానుంది. నాటకీయ పరిణామాల మధ్య గోవా ముఖ్యమంత్రిగా రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు. 40 శాసనసభ స్థానాలున్న గోవాలో అధికార బీజేపీ కి వచ్చింది కేవలం 13 సీట్లే. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 21 స్థానాలు అవసరం. ఇక్కడ 17 సీట్లను గెల్చుకోవడం ద్వారా కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజార్టీకి నాలుగు సీట్ల దూరంలోనే నిల్చిపోయింది. దీనితో గోవాలో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డారు. ఈ సమయంలో బీజేపీ పెద్దలు చక్రం తిప్పారు. స్వతంత్ర్య అభ్యర్థులను స్థానిక పార్టీలను తమవైపు తిప్పుకుని మెజార్టీ సంపాదించారు. సాక్షాత్తూ బీజేపీ ముఖ్యమంత్రి ఓటమీ చెందినా ఇక్కడ ఆ పార్టీనే అధికారం చేపడుతోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. బీజేపీ అనైతిక మార్గాల ద్వారా అధికారంలోకి వస్తోందంటూ ఆ పార్టీ విరుచుకుని పడుతోంది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లోనూ మొట్టమొదటి సారి బీజేపీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనుంది. నాగా పీపుల్స్ ఫ్రంట్, నాగా పీపుల్స్ పార్టీ లాంటి పార్టీలతో జట్టుకట్టడం ద్వారా ఇక్కడ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. 60 అసెంబ్లీ సీట్లున్న మణిపూర్ లో కాంగ్రెస్ 28 స్థానాలను గెల్చుకోవడం ద్వారా అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారంలోకి రావడానికి అవసరమైన 31 మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేకపోయింది. మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రం ఇబోబి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని తామంటే తాము ఏర్పాటు చేస్తామంటూ ఇరు పార్టీలు ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు స్థానిక పార్టీలు ముందుకు రాకపోవడంతో ఇక్కడా బీజేపీ నేతలు చక్రం తిప్పి స్థానిక పార్టీలను తమ వైపుకు తిప్పుకున్నారు. దీనితో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనంత మంది ఎమ్మెల్యేల మద్దతు తమకి ఉందటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన బీజేపీ మొదటిసారిగా ఇక్కడ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తమదే అతిపెద్ద పార్టీ అయినందున తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని పట్టుపట్టి రాజీనామాకు ససేమీరా అన్న ముఖ్యమంత్రి కూడా ఎట్టకేలకు రాజీనామా ఇవ్వడానికి సిద్ధ పడ్డారు.
ఒకప్పుడు కాంగ్రెస్ నేతలు నెరిపిన రాజకీయాన్ని బీజేపీ నేతలు బాగా వంటపట్టించుకున్నట్టు కనిపిస్తోంది. స్థానిక పార్టీలను దారిలోకి తెచ్చుకోవడం ద్వారా మెజార్టీ రాకున్నా రెండు రాష్ట్రాల్లోనూ అధికార పగ్గాల్ని బీజేపీ చేపడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *