హంగ్ వస్తే… యూపీలో కొత్త పొత్తులు..?

ఎన్నికల ఫలితాలు రావడానికి ఒక రోజు ముందు ఉత్తర్ ప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కీలకమైన ఈ రాష్ట్రంలో పాగా వేయడానికి బీజేపీ తయారవుతుండగా బీజేపీని ఎట్లా అయినా నిలువరించాలని సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ లు సిద్ధపడుతున్నాయి. పలు సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించడం ఖాయంగా కనిపిస్తున్నా మెజార్టీకి కొద్ది దూరంలో బీజేపీ నిల్చిపోయే అవకాశాలున్నట్టు సర్వే ఫలితాల ద్వారా తేలడంతో ఇప్పుడు యూపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు రంగం సిద్ధం అవుతోంది. బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి అన్ని లౌకిక శక్తులతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం ద్వారా బీఎస్పీతో పొత్తుకు సిద్ధమని ఎస్పీ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా మాయవతి తో దోస్తీకి అఖిలేష్ యాదవ్ ప్రయత్నాలు ప్రారంభించినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తో జట్టుకట్టి ఎన్నికల్లో పోటీ చేసిన అఖిలేష్ యాదవ్ ఇప్పుడు లౌకిక కూటమి పేరుతో బీఎస్పీతోను ఎన్నికల అనంతరం పొత్తుకు రెడీ అవుతున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వస్తే తప్ప హంగ్ ఏర్పడితే మాత్రం బీజేపీని అడ్డుకోవాలనే వ్యూహంతో అఖిలేష్ యాదవ్ ముందుకు వెళ్తున్నాడు. బీఎస్పీ, కాంగ్రెస్ లను కలుపుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. హంగ్ పరిస్థితులు వస్తే బీజేపీ కూడా ప్రభుత్వం ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తుందనేది విస్పష్టం. గతంలో బీఎస్పీతో ఉన్న దోస్తీని మరోసారి తెరపైకి తీసుకుని వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. తాము స్వంతగానే అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు చెప్తున్నప్పటికీ ఒకవేళ హంగ్ వస్తే ఏంచేయాలి అనే అంశంపై బీజేపీ కీలక నేతలు వ్యూహాల్లో మునిగిపోయారు.
మరో వైపు ఉత్తర్ ప్రదేశ్ లో హంగ్ వస్తే ఖచ్చితంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి కింగ్ మేకర్ అవుతారు. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని ఆమె ఖచ్చితంగా తనకు అనుకూలంగా మార్చుకునే సత్తా ఉన్న మాయవతి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కొన్ని గంటల్లోనే తేలిపోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *