హైకోర్టు జడ్జీపై అరెస్ట్ వారెంట్

భారత న్యాయ వ్యవస్థలోనే తొలిసారిగా ఒక హైకోర్టు జడ్జికి సుప్రీం కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. కోర్టు దిక్కారణ కేసులో ఈ వారెంట్ జారీ అయింది. కలకత్తా హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ సీఎస్ కర్ణన్ కోర్టుధిక్కార కేసును ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టులో హాజరుకావాల్సి ఉన్నా ఆయన రాకపోవడంతో కోర్టు అరెస్టు వారెంట్ ను జారీ చేసింది. మార్చి 31వ తేదీ లోగా తమ ముందు హాజరుపర్చాల్సిందిగా కలకత్తా పోలీసులను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు  బెయిలబుల్ అరెస్టు వారెంట్ కావడంతో 10 వేల రూపాయల పూచీకత్తుతో ఆయన బెయిల్ తీసుకోవచ్చు.
జస్టిస్ కర్ణన్ కొందరు సహ న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేశారు. ఈ మేరకు ప్రధానితో పాటుగా ఇతరులకు లేఖలు రాయడం వివాదాస్పదం అయింది. ఈ లేఖల ఆధారంగా ఆయనపై కోర్టు దిక్కారణ కేసును నమోదు చేశారు. దీనితో పాటుగా కర్ణన్ తమ కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ మరో న్యాయమూర్తి భార్య కూడా సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ జరుపుతున్న చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం జస్టిస్ కర్ణన్ కు అరెస్టు వారెంట్ జారీచేసింది. తాను దళితుడిని కావడం వల్లే తనపై తప్పుడు ఆరోపణలతో వేధింపులకు గురిచేస్తున్నారని కర్ణన్ ఆరోపిస్తున్నారు. లోపాలను ఎత్తిచూపితే తనపైనే నిందలు వేస్తున్నారని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *