ఆస్తులపై చర్చకు సిద్ధమంటున్న లోకేశ్

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన తన ఆస్తులపై విపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నేత, ఏపీ సీఎం తనయుడు నార లోకేశ్ అన్నారు. తాను ప్రకటించిన ఆస్తులకు సంబంధించిన అన్ని వివరాలు చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని లోకేశ్ ప్రకటించారు. తన ఆస్తులపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తన ఆస్తులపై లేనిపోని గొడవలు సృస్టిస్తున్న వాళ్లు ముందుగా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని లోకేశ్ పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం ఆస్తులను ప్రకటించడం ద్వార తమ కుటుంబం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. దమ్ముంటే విపక్షనేత జగన్ తన ఆస్తులను ప్రకటించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. 12 కేసుల్లో ఏ-1 గా ఉన్న జగన్ ఆస్తులను గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

మరో వైపు లోకేశ్ ఆస్తులు హఠాత్తుగా ఇన్ని రెట్లు ఏవిధంగా పెరిగాయని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. గత అక్టోబర్ లో లోకేశ్ ఆస్తిని 14.5 కోట్లుగా ప్రకటించి ఇప్పుడు 330.14 కోట్లుగా చెప్పడం ఏంటని వారంటున్నారు. ఐదు నెలల్లోనే లోకేశ్ ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులను ఏ విధంగా కూడాగట్టుకున్నారో చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆస్తుల ప్రకటన బూటకమని అదో నాటమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పెరిగిన ఆస్తులు ఏ విధంగా సంపాదించారో వెళ్లడించాలని వారు అంటున్నారు. ఐదు నెలల్లో లోకేశ్ ఆస్తులు దాదాపుగా 22 రెట్లమేరకు పెరిగాయని ఇది ఏ విధంగా సాధ్యమో చెప్పాలని వారంటున్నారు.